
ఓటరు జాబితా అభ్యంతరాలు సరిచేస్తాం
ఇబ్రహీంపట్నం రూరల్: ఓటరు జాబితా ముసాయిదాపై ఎలాంటి అభ్యంతరాలున్నా స్వీకరించి సరి చేస్తామని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాపై శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 జూలై 1న అందుబాటులోకి వచ్చిన నియోజకవర్గాల వారీ ఓటరు జాబితాను అనుసరించి పంచాయతీ, వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 30 వరకు సరి చేసుకోవచ్చని తెలిపారు. పోలింగ్ బూత్‌ల జాబితాలో అభ్యంతరాలున్నా తెలియజేయాలన్నారు. ఈ నెల 30న ఆయా మండ లాల్లో ఎంపీడీఓలు నిర్వహించే రాజకీయ పార్టీల సమావేశాల్లోనూ అభ్యంతరాలు తెలపొచ్చన్నారు. వాటిని ఈనెల 31న జిల్లా పంచాయతీ అధికారులు పరిష్కరిస్తారని స్పష్టం చేశారు. వచ్చే నెల 2న పంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటోలతో కూడిన తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో డీపీఓ సురేష్ మోహన్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకుడు సత్తు వెంకటరమణారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాంభూపాల్, నాయకులు బోసుపల్లి ప్రతాప్, సామేలు, పర్వతాలు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాస్