
ఓటర్ల ముసాయిదా వెల్లడి
● 7,52,254 మంది ఓటర్లు
● 4,682 పోలింగ్ కేంద్రాలు
● మండలాల వారీగా ఓటర్ల జాబితా
● పోలింగ్ కేంద్రాలు రెడీ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్థానిక సంస్థల ఓటర్ల ముసాయిదా జాబితాను జిల్లా ఎన్నికల అధికారి శుక్రవారం విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 21 మండలాల పరిధిలో 526 గ్రామ పంచాయతీలు ఉండగా వీటి పరిధిలో 7,52,254 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 3,76,873 మంది పురుషులు, 3,75,353 మంది మహిళలు, మరో 28 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. వార్డుల వారీగా మొత్తం 4,682 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే సిద్ధం చేసిన ప్రాథమిక ఓటర్ల జాబితాను ఆయా పంచాయతీ బోర్డులపై అతికించింది. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై వచ్చే అభ్యంతరాలను ఈ నెల 30 వరకు స్వీకరించనున్నారు. 31న పరిష్కారం, సెప్టెంబర్ 2న వార్డుల వారీగా ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ముందు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారా.. లేక జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకా అనేది ఇంకా తేలాల్సి ఉంది.