
ఉద్రిక్తతల మధ్య సర్వే
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సి పల్ పరిధిలోని కొంగరకలాన్‌లో శుక్రవారం రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వేలో ఉద్రిక్తత నెలకొంది. సర్వే చేయొద్దని ఓ వర్గం రైతులు, చేయాల్సిందేనని మరో వర్గం వారు పట్టుబట్టడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కొంగకలాన్‌కు చెందిన రైతు నీళ్ల ప్రభాకర్ ఫిరోజ్‌గూడ సర్వే నంబర్లు 44, 45, 46లో సర్వే కోసం దరఖాస్తు చేశాడు. దీంతో డివిజనల్ సర్వేయర్, మండల సర్వేయర్ పొజిషన్ వద్దకు చేరుకున్నారు. అయితే తమకు నోటీసులు ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారని నీళ్ల కుటుంబానికి చెందిన పలువురు చుట్టుపక్కల రైతులు అడ్డుకున్నారు. నీళ్ల ప్రభాకర్ పేరున గుంట భూమి కూడా లేదని, పాసుపుస్తకాలు, ధరణిలో అతని పేరు కూడా లేదని మండిపడ్డారు. దీంతో అధికారులు సర్వేకు వెనకడుగు వేశారు. కొద్ది సేపటి తర్వాత సర్వే పూర్తి చేయాలని తమకు ఉన్నతాధికారి నుంచి ఆదేశం ఉందని, సర్వేకు అడ్డు పడొద్దని ఆందోళనకారులకు సూచించారు. దీనికి తోడు ఎట్టి పరిస్థితిలోనూ సర్వే చేయాల్సిందేనని, మిగులు భూమి ఉందనే కారణంతోనే సర్వేను అడ్డుకుంటున్నారని రెండోవర్గం వారు వారించారు. ఈక్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో కొంతమంది 100కు డయల్ చేశారు. దీంతో ఆదిబట్ల పోలీసులు అక్క డికి చేరుకుని సర్వేకు సహకరించాలని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. సర్వే చేస్తే మిగులు భూమి వస్తే దానికి సంబంధించిన రికార్డులు ఎలా సృష్టిస్తారని పలువురు రైతులు ప్రశ్నించారు. ఇదే విషయపై గతంలో పరస్పర దాడులు చేసుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని, వీరికి పోలీసులు సహకరించారని పలువురు రైతులు ఆరోపించారు. మొత్తానికి అధికారులు సర్వే ప్రక్రియను ప్రారంభించారు.
కొంగరకలాన్‌లో భూ సర్వేకు వచ్చిన రెవెన్యూ అధికారులు
అడ్డుకున్న ఓ వర్గం రైతులు
సర్వేకు పట్టుబట్టిన మరో వర్గం
పోలీసుల సహకారంతో ప్రక్రియ ప్రారంభం