
ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు
హెచ్‌యం పద్మ నళిని
షాద్‌నగర్: అంకిత భావంతో పని చేసే ఉపాధ్యాయులకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని హెచ్‌యం పద్మ నళిని అన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు పండిత్‌గా విధులు నిర్వహిస్తున్న కోట్ల విజయలక్ష్మీ ఉద్యోగ విరమణ సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌యం పద్మ నళిని మాట్లాడుతూ... విద్యాభివృద్ది కోసం అంకిత భావంతో పని చేసే ఉపాద్యాయులు విద్యార్ధులు హృదయాల్లో సుస్దిరమైన స్ధానం సంపాదిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులతో కాపరులు జాగ్రత్త
మంచాల: మూగ జీవాలకు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల గొర్ల కాపర్లు జాగ్రతగా ఉండాలని పశు వైద్యాధికారి సుధారెడ్డి చెప్పారు. శుక్రవారం మండల పరిధి నోముల గ్రామంలో జీవాలకు పుర్రు రోగం టీకా వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో వచ్చే వాతావరణ మార్కుల వలన జీవాలు రోగాల బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. ముందు జాగ్రత్తగా వాటికి టీకా వేయించాలని సూచించారు. పశు వైద్య సిబ్బంది శ్రీశైలం పాల్గొన్నారు.
జూదరుల అరెస్టు
ఇబ్రహీంపట్నం రూరల్: పేకాట స్థావరంపై మహేశ్వరం జోన్ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి ఆదిబట్ల పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఓటీ సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధి సాహేబ్‌గూడలో నర్సింహ వ్యవసాయ క్షేత్రంలో జూదం ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పోతురాజు నర్సింహ, దండు లక్ష్మయ్య, బొమ్మరాజు సురేష్, గుండ్ల శ్రీనివాస్, అల్వాల రాంచంద్రారెడ్డి, పాతూరి శర్వందాగౌడ్, నరేందర్, నారని పరమేష్‌గౌడ్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.లక్ష 4వేలు, రెండు సెట్ల కార్డులు, 8 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.

ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు