
కార్మికుడు బలవన్మరణం
పురుగు మందుతాగి.. చికిత్స పొందుతూ మృతి
నందిగామ: పురుగు మందు తాగి ఓ కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధి ఆర్‌ఎం స్టీల్ పరిశ్రమలో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫరూఖ్‌నగర్ మండలం జీడీగడ్డ తండా వాసి పాత్లావత్ మోహన్(32) ఏడేళ్లుగా నందిగామ మండలంలోని పరిశ్రమలో క్వాలిటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం యథావిధిగా విధులకు వచ్చిన మోహన్.. 11.30 గంటల సమయంలో పరిశ్రమలోనే పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడున్నాడు. ఇది గమనించిన తోటి కార్మికులు చికిత్స నిమిత్తం శంషాబాదులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. గతంలో జరిగిన ప్రమాదం వలన అయిన గాయాల బాధ భరించలేకే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. మోహన్ ఆత్మహత్యకునిరసనగా తొలుత కుటుంబీకులు పరిశ్రమ ఎదుటఆందోళన వ్యక్తంచేశారు. కంపెనీలో ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని యాజమాన్యంపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఎస్‌ఐ దేవరాజ్ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన కారులతో మాట్లాడారు. యాజమాన్యంతో మాట్లాడిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.