
నానోతో లాభాలెన్నో..
● ద్రవరూప యూరియాతో తక్కువ ఖర్చు, తక్కువ శ్రమ, ఎక్కువ పనితీరు
● రైతులు అవగాహన పెంచుకోవాలి
● వ్యవసాయ శాఖ అధికారులు
కందుకూరు: యూరియా కొరతతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక్క బస్తా కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని అధిగమించడానికి ప్రస్తుతం మార్కెట్లో ప్రత్యామ్నాయంగా నానో యూరియా ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రైతులు దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. యూరియాను కొని పొలాలకు తరలించే మోత బరువు తగ్గుతుందని పేర్కొంటున్నారు. నానో ద్రవ రూపంలో ఉండటంతో ఇతర ఫెస్టిసైడ్స్ మాదిరిగానే తీసుకెళ్లి పంటలపై పిచికారీ చేసుకోవచ్చు.
సాధారణ యూరియా..
● సాధారణ యూరియా 45 కిలోల బస్తా ధర రూ.266.50 ఉంది.
● ఎకరాకు 2 నుంచి 4 బస్తాలు అవసరం అవుతుంది.
● రవాణా ఖర్చు అదనం.
● 35 శాతం నత్రజని మాత్రమే పంటకు అందుతుంది. మిగిలిన నత్రజని ఆవిరైపోతుంది.
● దీని పనితనం పంటపై 2– 3 రోజులు మాత్రమే ఉంటుంది.
● వేర్ల నుంచి ఆకులకు పంట పైభాగాలకు నత్రజని తక్కువగా చేరడంతో పాటు ఎక్కువ సమయం తీసుకుంటుంది.
● యూరియా బస్తాలను వాడకుండా వదిలేస్తే రెండు నెలల తర్వాత గడ్డ కట్టే అవకాశం ఉంది.
● ఎరువుల కంపెనీలు యూరియా ఉత్పత్తికి అంతరాయం కలిగితే కొరత ఏర్పడుతుంది.
● ప్రభుత్వం ప్రతి యూరియా బస్తాపై రూ.1,970 చొప్పున కంపెనీలకు రాయితీ రూపంలో చెల్లిస్తుంది. వీటి భారం పరోక్షంగా ప్రజలపై పడుతుంది.
నానో యూరియా...
● నానో యూరియా 500 మి.లీ ధర రూ.225 నుంచి ఎంఆర్పీ ప్రకారం దొరుకుతుంది.
● ఎకరాకు 500 మి.లీ. బాటిల్ సరిపోతుంది.
● రవాణా ఖర్చు ఉండదు.
● మొక్కలకు 80 శాతం నత్రజని అందుతుంది.
● దీని పనితనం పంటపై 8– 10 రోజులు ఉంటుంది.
● పంటపై నేరుగా పిచికారీ చేయడంతో మొక్క అన్ని భాగాలకు సులభంగా చేరుతుంది.
● ఏడాది వరకు ఉపయోగించుకోవచ్చు.
● ఎరువుల కంపెనీలు నానో యూరియా ఉత్పత్తికి అంతరాయం కలిగే అవకాశమే లేదు. దీని ఉత్పత్తిని తక్కువ ఖర్చుతో తక్కువ స్థలంలో చేసుకోవచ్చు. ప్రస్తుతం నానో యూరియాతో పాటు నానో డీఏపీ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది.
విరివిగా వాడాలి
ప్రస్తుతం యూరియా కొరతను అధిగమించేందుకు నానో యూరియా వాడాలి. దీన్ని సులువుగా పొలాలకు తరలించవచ్చు. రైతులందరూ విరివిగా నానో యూరియా వినియోగించాలి.
– జగదీశ్వర్‌రెడ్డి ఆర్డీఓ, కందుకూరు
యూరియాలాగే పనిచేస్తుంది
నానో యూరియా కూడా యూరియా మాదిరిగానే పనిచేస్తుంది. రైతులు ధైర్యంగా వాడుకోవచ్చు. పంట ఖర్చు కూడా తగ్గుతుంది. కొరతను అధిగమించడానికి ఇది ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది. – లావణ్య, ఏఓ, కందుకూరు

నానోతో లాభాలెన్నో..

నానోతో లాభాలెన్నో..