
మొబైల్ షాపు దగ్ధం
కడ్తాల్: ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఓ మొబైల్‌షాపు దగ్ధమైన సంఘటన మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అన్మాస్‌పల్లికి చెందిన కాళ్ల గణేశ్ కడ్తాల్‌లోని ఉప్పరి మల్లయ్య కాంప్లెక్స్‌లో ఓ షటర్ అద్దెకు తీసుకుని మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే బుధవారం రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగి.. ఫోన్లు, ల్యాప్‌టాప్, ఎల్‌ఈడీ టీవీ, ఇతర విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్ధమయ్యాయి. గురువారం ఉదయం షాపు వద్దకు వెళ్లిన బాధితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు.
పెయింటర్ దారుణ హత్య..
సనత్‌నగర్: ఓ పెయింటర్ హత్యకు గురైన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తాను పనిచేసే చోట మహిళతో చనువుగా ఉండడాన్ని గుర్తించిన ఆమె భర్త, కుటుంబ సభ్యులు చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన బబ్లూ (22) నగరానికి వలసవచ్చి పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భరత్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మేసీ్త్ర రాజారామ్‌తో పాటు అతని భార్య, మామ రవీందర్, అత్త కౌసల్య, బాబాయి రాజేంద్రలు కూడా అదే భవనంలో కార్మికులుగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. బుధవారం రాత్రి రాజారామ్ భార్య బబ్లూతో కలిసి ఉండటాన్ని గుర్తించాడు. ఈ విషయాన్ని మామ రవీందర్, బంధువులకు చెప్పడంతో అందరూ కలిసి బబ్లూపై దాడి చేయడంతో అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని వాచ్‌మెన్ మల్కాజిగిరిలో ఉంటున్న బబ్లూ సోదరుడికి చెప్పడంతో అక్కడికి వచ్చిన అతను బబ్లూను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బూబ్లూ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాజారామ్, రవీందర్, కౌసల్య, రాజేంద్రలను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
డ్రగ్స్ కేసులో సహకరిస్తాం
మహీంద్రా యూనివర్సిటీ వీసీ డాక్టర్ యాజుల మేడూరి
సుభాష్‌నగర్: బహదూర్‌పల్లి లోని మహీంద్రా యూనివర్సిటీలో గంజాయి, డ్రగ్స్ పట్టుబడిన ఘటనపై దర్యాప్తులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ యాజుల మేడూరి అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తాము క్రమశిక్షణ, నిజాయితీ, చట్టానికి గౌరవం వంటి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నామన్నారు. ఇటీవల కొందరు విద్యార్థులకు నార్కోటిక్స్ కేసులో ప్రమేయం ఉన్నట్లు వచ్చిన వార్తలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. మత్తు పదార్థాల వినియోగం, కలిగి ఉండటం లేదా పంపిణీ చేయడాన్ని విశ్వవిద్యాలయం ఖండిస్తుందని, తమ యూనివర్సిటీ జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తుందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే, లేదా తమ విద్యార్థి సమాజం భద్రత, సంక్షేమాన్ని ప్రమాదంలోకి నెట్టే ఏ చర్యకై నా విశ్వవిద్యాలయ నియమావళి, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు తాము పూర్తిగా సహకరిస్తున్నామన్నారు. తమ సంస్థ విలువలు, సమగ్రతను కాపాడటానికి అవసరమైన ప్రతి చర్య తీసుకుంటూ, సురక్షితమైన, బాధ్యతాయుతమైన, క్రమశిక్షణతో కూడిన క్యాంపస్ వాతావరణాన్ని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. మత్తుపదార్థాల వినియోగం వల్ల ఎదురయ్యే పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.. విద్యార్థులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వర్సిటీ విలువలను కాపాడాలని కోరారు.
సివిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు మెమో జారీ
అనంతగిరి: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లా సివిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్. ఆనంద్‌కు కలెక్టర్ మెమో జారీ చేశారు. గురువారం వికారాబాద్ జిల్లా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో పని చేస్తున్న 9 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కలెక్టర్ అనుమతి లేకుండా, ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా బదిలీ చేయడం జరిగింది. దీంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో పరిపాలన పనులకు ఆటంకం ఏర్పడింది. అట్టి మెమోకు ఒక్క రోజులో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.