
అధికారులు సెలవుపై వెళ్లొద్దు
● వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
● ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం: భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు, రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి, ఎలాంటి ప్రమాదాల సంభవించకుండా చూడాలని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఇబ్రహీంపట్నం ప్రజాభవన్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాలతో చెరువులు, కుంటలు నిండి అలుగు పరుతున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో అధికారులు సెలవులపై వెళ్లొదన్నారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ అధికారులు వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై దృష్టి సారించి మరమ్మతులు చేపట్టాలన్నారు. వైద్యులు, సిబ్బంది కచ్చితంగా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మున్సిపాలిటీల్లో చెత్తచెదారం, మురికి నీరు నిల్వకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విద్యుత్ పంపిణీలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, తుర్కయంజాల్‌లో పెద్దఎత్తున నిర్వహించే గణేశ్ నిమజ్జనోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ ఏడాది మంజూరు చేసిన ఐదు వేల ఇందిరమ్మ ఇళ్లలో నాలుగు వేలు గ్రౌండింగ్ పూర్తి కావాలని ఆదేశించారు. కొలతలకు తగ్గట్టుగా స్థలాలు లేకపోవడంతో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాటిని గుర్తించి సరి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ అనంతరెడ్డి, ఏసీపీ కేపీవీ రాజుతోపాటు ఆయా మండలాల ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.