
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
ఆమనగల్లు: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి డిమాండ్ చేశారు. తలకొండపల్లి మండల కేంద్రంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంతకుముందు మండల కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ రమేశ్‌కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. హామీల అమలు విఫలమైందని ఎద్దేవ చేశారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు పెంచాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాలకు స్థలాలు చూపించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రవిగౌడ్, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు పాండుప్రసాద్, మాజీ సర్పంచ్ కుమార్, నాయకులు పాండు, అనిల్, రాజు, శ్రీనివాసాచారి, సుదర్శన్, శేఖర్‌రెడ్డి, శాంతకుమారి, గిరి పాల్గొన్నారు.