
చిరువ్యాపారుల దుకాణాలు తొలగింపు
చేవెళ్ల: మున్సిపల్ కేంద్రంలో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరువ్యాపారుల దుకాణాలను మంగళవారం మున్సిపల్ అధికారులు తొలగించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే అధికారులు ట్రాఫిక్, సివిల్ పోలీసుల సహకారంతో జేసీబీ, డోజర్లతో వచ్చి తొలగింపు చర్యలు చేపట్టారు. బస్‌స్టేషన్, పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాల తొలగించారు. విషయం తెలుసుకున్న వ్యాపారులు అక్కడికి చేరుకున్నారు. చిరువ్యాపారాలే తమకు జీవనాధారమని, దుకాణాలను తొలగిస్తే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న పెద్ద వ్యాపార సముదాయాలను వదిలి తమనే టార్గెట్ చేయడం సరైంది కాదన్నారు. మున్సిపల్ అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త వాతవారణం నెలకొంది. నిబంధనల ప్రకారమే అక్రమంగా వెలసిన దుకాణాలను తొలగిస్తున్నామని, వ్యాపారులకు సైతం సమాచారం అందించామని అధికారులు తెలిపారు. రైతుబజారు స్థలంలో వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. మార్కెట్ పాలకవర్గం సభ్యులు రైతు బజారులోని స్థలాన్ని చదును చేసి దుకాణాల ఏర్పాటుకు సహకరించారు. సోమవారం సిమెంట్ ట్యాంకర్ బైక్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో తండ్రీకూతురు మృతి చెంది న సంగతి తెలిసిందే. నిత్యం ట్రాఫిక్‌జామ్, ప్రమా దాలకు రోడ్డుపక్కన ఉండే దుకాణాలే కారణమని భావించిన అధికారులు వాటిని తొలగించారు.