‘భూదాన్‌’పై విచారణ | - | Sakshi
Sakshi News home page

‘భూదాన్‌’పై విచారణ

Aug 27 2025 9:41 AM | Updated on Aug 27 2025 9:41 AM

‘భూదా

‘భూదాన్‌’పై విచారణ

యాచారం: తాడిపర్తి భూదాన్‌ భూమి(ఎడ్లకంచె) మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ భూమికి ఫార్మా పరిహారం అందజేతపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌ అయినట్లు తెలిసింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. భూదాన్‌ భూమికి ఫార్మా పరిహారం అందజేతపై మంగళవారం సీఎంఓ ఉన్నతాధికారులు ఇబ్రహీంపట్నం భూసేకరణ అధికారులకు ఫోన్లు చేసి ప్రాథమిక సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం. ఆచార్య వినోభాబావే నేతృత్వంలో 1954లో జరిగిన భూదానోద్యమంలో భాగంగా మండలంలోని తాడిపర్తి గ్రామానికి చెందిన బొక్క సీతారెడ్డి కుటుంబ సభ్యులు తమ పేరిట ఉన్న సర్వేనంబరు 104లో ఉన్న 250 ఎకరాలను సర్వోదయ భూదాన్‌ యజ్ఞ బోర్డుకు దానం చేశారు. అప్పట్లో రెవెన్యూ అధికారులు ఈ భూమిని రికార్డుల్లో నమోదు చేయలేదు. పర్యవేక్షించాల్సిన రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం చేసింది. ఆ తర్వాత గ్రామస్తులు ఈ భూముల్లో ఎర్రజెండాలు పాతి పశువులు, గొర్రెలు, మేకలను మోపుతూ, కొంత భూమిని సాగు చేసుకున్నారు.

దొడ్డిదారిన హక్కు పత్రాలు

సర్వేనంబరు 104లోని 250 ఎకరాలను గ్రామస్తులు భూదాన్‌ యజ్ఞ బోర్డుకు దానం చేసిన రెవెన్యూ అధికారులు రికార్డుల్లో మార్చకపోవడంతో అక్రమార్కుల కన్ను పడింది. రికార్డుల్లో భూదాన యజ్ఞ బోర్డుకు దానం చేసిన రైతుల పేర్లే వస్తుండడంతో రెవెన్యూ అధికారులు అండదండలతో కొందరు సదరు భూమిని కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించారు. 2010 తర్వాత ఈ భూమిని చదును చేసి అక్రమంగా వెంచర్‌ కూడా చేశారు. పట్టా రైతుల పేర్ల స్థానంలో దొడ్డిదారిన చేరిన భూకబ్జాదారుల పేర్లే రికార్డుల్లో నమోదు అవుతున్నాయి. వాటి ఆధారంగా అప్పటి బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలోనే రాజకీయ పలుకుబడి కలిగిన నేతలు ఈ భూమిని కొనుగోలు చేసి, రికార్డులను తమ పేర్లపై మార్చుకున్నారు. ఆ తర్వాత రియల్‌ ప్రభావంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి.

ఫార్మాతో రూ.27 కోట్ల పరిహారం

గత బీఆర్‌ఎస్‌ హయాంలో ఫార్మాసిటీకి సేకరించాల్సిన 19,333 ఎకరాల్లో సింహభాగం మండలంలోని తాడిపర్తి, కుర్మిద్ద, నానక్‌నగర్‌, నక్కర్తమేడిపల్లి గ్రామాల నుంచే ఉంది. అధికారులు తాడిపర్తి సర్వేనంబరు 104లోని 250 ఎకరాల భూమి సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇదే అదునుగా భావించి భూదాన్‌ భూమిలో పట్టాదారు, పాసుపుస్తకాలు పొందిన రైతులు ఫార్మాకు ఇవ్వడానికి అధికారులకు అంగీకార పత్రాలు ఇచ్చారు. సదరు భూమి భూదాన్‌ యజ్ఞ బోర్డుకు చెందినదని స్థానిక రైతులు ఆందోళనకు దిగి, ఫార్మాసిటీకి సేకరించవద్దని హైకోర్టును సైతం ఆశ్రయించారు. దీంతో అక్రమార్కులు పరిహారం కోసం ఉన్నత స్థాయిలో పైరవీలకు జీవం పోశారు. 2020–23 మధ్యలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓగా పనిచేసిన ఓ అధికారి అండతో పరిహారం పొందడానికి లైన్‌ క్లియర్‌ చేసుకున్నారు. మొత్తం 250 ఎకరాల్లో 53 ఎకరాలు అటవీ ప్రాంతం ఉందని, 24 ఎకరాల్లో బంధం చెరువు, 5 ఎకరాల భూమిలో పలు దేవతామూర్తుల ఆలయాలకు వదిలి, మిగతా 168 ఎకరాల భూమికిగాను 85 మంది రైతులకు ఎకరాకు రూ.16 లక్షల చొప్పు న రూ.27 కోట్లకు పైగా పరిహారాన్ని అందజేశా రు. గ్రామస్తుల ఆందోళనలతో పరిహారం పొందిన రైతులకు ఫార్మా ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపేశారు.

తాడిపర్తిలో ఫార్మా పరిహారం

అందజేతపై సీఎం ఆగ్రహం

సీఎంఓ కార్యాలయం నుంచి

ప్రత్యేకాధికారి నియామకం

ఇప్పటికే టీజీఐఐసీ వెంచర్‌లో

ప్లాట్ల రిజిస్ట్రేషన్ల నిలిపివేత

న్యాయం కోసం రైతుల వేడుకోలు

ఫార్మా ప్లాట్లు నిలిపేశాం

తాడిపర్తిలోని సర్వేనంబరు 104లో ఫార్మా పరిహారం పొందిన రైతులకు మీరా ఖాన్‌పేటలోని టీజీఐఐసీ వెంచర్‌లో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపేశాం. తాజాగా ఈ విషయం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. సీఎంఓ లేదా సీసీఎల్‌ఏ కార్యాలయాల నుంచి ఉన్నతాధికారులతో విచారణ చేయొచ్చు. నాకై తే సమాచారం లేదు.

– అనంత్‌రెడ్డి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం

‘భూదాన్‌’పై విచారణ1
1/1

‘భూదాన్‌’పై విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement