
ఈ రోడ్డు బాగు చేయండి
మంచాల: వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిన మంచాల–ఆగాపల్లి రోడ్డుకు మరమ్మతులు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కాగజ్‌ఘట్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా రోడ్డు నిర్మాణం పనులు పూర్తి కావడం లేదన్నారు. ఆగాపల్లి నుంచి కాగజ్‌ఘట్, జాపాల మీదుగా మంచాల మండల కేంద్రానికి చేరుకోవడానికి సులభంగా ఉంటుందన్నారు. రహదారిపై గోతులు ఏర్పడడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. వెంటనే బాగు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రాజు, యాదగిరి, నగేష్, యాదయ్య, భిక్షపతి, దానయ్య, భరత్, కృష్ణ, రంజిత్, మణి తదితరులు పాల్గొన్నారు.
యూరియా కోసం
ఆందోళన చెందొద్దు
కడ్తాల్: యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని మండల వ్యవసాయ శాఖ అధికారి కవిత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 570 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామన్నారు. గతేడాది కడ్తాల్, రావిచేడ్ గ్రామాల్లోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా సరఫరా చేశామన్నారు. ప్రస్తుతం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలతో పాటు, కడ్తాల్, ముద్వీన్ గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామన్నారు.
ఆర్టీసీ బస్సులో మంటలు
గోల్కొండ: బస్టాప్‌లో నిల్చున్న సిటీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన సంఘటన మెహిదీపట్నం బస్టాండ్‌లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మెహిదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లింగంపల్లి నుంచి మంగళవారం ఉదయం మెహిదీపట్నం బస్టాప్‌కు వచ్చింది. సమీపంలోకి రాగానే బస్సు ఆకస్మాత్తుగా ఆగిపోయింది. డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపి మళ్లీ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బస్సు తిరిగి స్టార్ట్ కాకపోవడంతో ప్రయాణికులందరూ దిగిపోయారు. దీంతో డ్రైవర్ బస్సు బానెట్ ఓపెన్ చేసి కేబుల్ సరి చేస్తుండగా ఒకేసారి మంటలు చెలరేగాయి. స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ సంఘటనా స్థలానికి చేరుకునేలోగా బస్సు ముందుబాగం దగ్ధమైంది. మెహిదీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ కే.వీ.ఎన్.మూర్తి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.