
లారీ ఢీకొని క్లీనర్ మృతి
ఖమ్మంక్రైం: లారీ నుంచి కిందకు దిగిన క్లీనర్ సైడ్ చెబుతున్న క్రమాన అదే లారీ ఢీకొనడంతో మృత్యువాత పడ్డాడు. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామానికి చెందిన చిందం శ్రీశైలం(50) లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. తుర్కపల్లి నుంచి యూరియా లోడ్ తీసుకుని, డ్రైవర్‌తో పాటు మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రానికి వచ్చాడు. ఈక్రమంలోరాపర్తినగర్ బైపాస్ వద్ద శ్రీశైలం కిందకు దిగి సైడ్ చూపుతుండగా డ్రైవర్ ఇస్తారి అజాగ్రత్తగా నడుపుతూ ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనకు ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై శ్రీశైలం భార్య అనురాధ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూ టౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో
వ్యక్తి బలవన్మరణం
షాద్‌నగర్‌రూరల్: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పట్టణంలోని ఆశా కాలనీలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన వారుగంటి చిన్నలింగయ్య(35) కొన్నేళ్ల క్రితం పట్టణానికి వలస వచ్చారు. ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తుండగా.. భార్య మేఘన మెస్‌లో పని చేస్తూ పిల్లలతో కలిసి ఉంటున్నారు. చిన్నలింగయ్యకు కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానుకోవాలని, ఏదైనా పని చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా పట్టించుకోలేదు. సోమవారం బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో భార్య మేఘన పిల్లలతో కలిసి బయలుదేరింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చిన్నలింగయ్య అదేరోజు రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి మృతుడి బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ బిచ్చయ్య తెలిపారు.