
సీపీఎం నేతల అరెస్ట్ అప్రజాస్వామికం
తుర్కయంజాల్: సీలింగ్ భూముల రైతులకు పట్టాలను పంపిణీ చేయాలని అనాజ్‌పూర్ పరిశీలనకు వెళ్తున్న సీపీఎం నేతల అరెస్ట్ అప్రజాస్వామికమని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు డి.కిషన్ అన్నారు. మంగళవారం పురపాలక సంఘం పరిధి తుర్కయంజాల్‌లో అరెస్ట్‌లను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నియంతలా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 1991లో అప్పటి ప్రభుత్వం 125 మంది రైతులకు ఒక్కోక్కరికి ఎకరం చొప్పున సీలింగ్ పట్టాలను ఇచ్చిందని, కొందరికి పాసు పుస్తకాలు కూడా జారీ అయ్యాయని గుర్తుచేశారు. ధరణి, భూభారతి వచ్చిన తరువాత పాసు బుక్‌లు ఇవ్వకుండా, రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో చేర్చకుండా తాత్సారం చేస్తున్నారని అన్నారు. దీన్ని ఖండిస్తూ ర్యాలీగా వెళ్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేయడం సరైనది కాదని అన్నారు. కార్యక్రమంలో నాయకులు బడుగుల శంకరయ్య, మాధవరెడ్డి, కృష్ణ, మధు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కిషన్