
ప్రభుత్వం రైతులను గోసపెడుతోంది
మొయినాబాద్: ఎన్నికల ముందు రైతులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూములను గుంజుకుంటూ రైతులను గోసపెడుతోందని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లిలో గోశాల ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులు చేపడుతున్న రిలే దీక్షలో శనివారం ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు సాగుచేసుకుంటున్న భూములను గోశాలకోసం తీసుకోవడం అన్యాయమని అన్నారు. కోకాపేటలో ఉన్న గోశాలను ఎనికేపల్లికి తరలించడంతో ఎవరికి లాభం అని ప్రశ్నించారు. రైతుల భూములు గుంజుకోవడానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రభుత్వానికి సహకరిస్తున్నారని.. అంతగా గోశాల ఏర్పాటుపై ఆసక్తి ఉంటే తన సొంతగ్రామం చించోలిపేట్‌లో ఏర్పాటు చేసుకోవాలని హితవు పలికారు. ఎకరాల భూమి తీసుకుని రైతులకు గజాల్లో ఇంటి స్థలం ఇవ్వడం ఏమిటని నిలదీశారు. రైతుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మోర నర్సింహారెడ్డి, ఓబీసీ మోర్చా నియోజకవర్గం కన్వీనర్ వెంకటేశ్‌గౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు డప్పు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.