
మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తాం
ఇబ్రహీంపట్నం రూరల్: మున్సిపాలిటీల్లో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నిరంతరం పని చేస్తుందని మెప్మా పీడీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, స్వయం ఉపాధి సంఘాల మహిళలకు స్మార్ట్ ఈషా, సంరక్షణ ఆస్పత్రుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులతో మేళా, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెప్మా పీడీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో సకల సౌకర్యాలు కల్పించాలని, పేదరిక నిర్మూలన కోసం కృషి చేయాలని తెలిపారు. స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో వంద రోజుల ప్రణాళిక ప్రత్యేకాధికారి శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది ప్రవీణ్‌గౌడ్, సాయికృష్ణారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శివలింగం తదిత రులు పాల్గొన్నారు.