
ఎనికేపల్లి రైతులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం
చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ
మొయినాబాద్: గోశాల ఏర్పాటుకు ప్రతిపాదించిన భూములు సాగుచేసుకుంటున్న రైతులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ అన్నారు. మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఆమె ఆరు రైతు కుటుంబాలకు చెందిన 11 మందికి ప్రొవిజినల్ అలాట్‌మెంట్ ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులంతా పట్టాలు తీసుకుని ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఎకరాకు 300 గజాల చొప్పున ఇప్పటి వరకు 21 కుటుంబాలకు చెందిన 52 మందికి పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన రైతులు పట్టుదలకు పోకుండా ఇళ్ల స్థలాల పట్టాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గౌతమ్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ వినోద్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.