భారీ వర్షం.. రైతన్న హర్షం | - | Sakshi
Sakshi News home page

భారీ వర్షం.. రైతన్న హర్షం

Jul 19 2025 1:13 PM | Updated on Jul 19 2025 1:13 PM

భారీ వర్షం.. రైతన్న హర్షం

భారీ వర్షం.. రైతన్న హర్షం

చేవెళ్ల: ఎట్టకేలకు రైతు ఎదురుచూపులను వరుణ దేవుడు కరుణించాడు. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రోడ్లన్నీ జలమయ్యమయ్యాయి. ఆలూరు రోడ్డు బురదమయంగా మారి ప్రజలు ఇబ్బంది పడ్డారు. చేవెళ్లలో రోడ్లుపై వర్షపు నీరు పారింది. ఎస్సీ వసతిగృహం ఎదుట, చేవెళ్ల దేవాలయ కమాన్‌ ఎదుట నీరు నిలిచి చెరువును తలపించింది.

పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

మొయినాబాద్‌: అర్థరాత్రి కురిసిన కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. మూడు గంటల పాటు ఏకదాటిగా కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లాయి. పలు చోట్ల వరద తాకిడికి ప్రహారీలు కూలాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీగా వరదలు రావడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మొయినాబాద్‌ మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. అర్థరాత్రి ఒంటి గంట నుంచి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల వరకు ఏగదాటిగా 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తిరిగి సాయంత్రం 5గంటల నుంచి 7.30గంటలకు మరో వారు వాన జోరు చూపింది. భారీగా వరదలు రావడంతో కాలువలు, లోతట్టు ప్రాంతాల్లో నిర్మించిన ప్రహారీలు కూలిపోయాయి. నాగిరెడ్డిగూడ, ఎనికేపల్లి దారి పక్కన నిర్మించిన ప్రహారీ గోడ వరద తాకిడికి కూలింది. ముర్తూజగూడ నుంచి డ్రీమ్‌వ్యాలీ రిసార్ట్స్‌కు వెళ్లే రోడ్డుకు ఇరువైపుల నిర్మించిన ప్రహారీ కూలిపోయింది. మొయినాబాద్‌ ఠాణా వెనుక ప్రహారీ గోడ కూలిపోయింది. ఇంత వర్షం 40 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు వాపోయారు. నాగిరెడ్డిగూడ, బాకారం, అమ్డాపూర్‌, వెంకటాపూర్‌, శ్రీరాంనగర్‌ గ్రామాలతోపాటు మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్‌, ముర్తూజగూడ, ఎనికేపల్లి, అజీజ్‌నగర్‌, హిమాయత్‌నగర్‌, చిలుకూరు, పెద్దమంగళారం గ్రామాల్లో ప్రీకాస్ట్‌ వాల్స్‌ కూలిపోయాయి. ఆయా ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్‌ లైన్లపై పడటంతో స్తంభాలు విరిగిపోయాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. శ్రీరాంనగర్‌ బోయవాగు, అమ్డాపూర్‌ పీతవాగు, బాకారం ఎర్రకుంట వాగు, నాగిరెడ్డిగూడ అబ్బుకుంట వాగుల్లో భారీగా వరదలు పారాయి. ఆయా వాగుల నుంచి ఈసీ వాగులోకి వెళ్లిన వరదనీరు హిమాయత్‌సాగర్‌ జలాశయంలోకి చేరింది. పలు చోట్ల కల్వర్టులపైనుంచి వరదనీరు పొంగి పొర్లింది. రోడ్లపైనుంచి వరదల పారడంతో నాగిరెడ్డిగూడ–బాకారం, అమ్డాపూర్‌–కాశీంబౌలి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారిపై అజీజ్‌నగర్‌చౌరస్తా, హిమాయత్‌నగర్‌ చౌరస్తా, భాస్కర ఆసుపత్రి, బోస్‌ గార్డెన్‌, మొయినాబాద్‌లలో భారీగా వర్షం నీరు నిలిచింది. ఆయా ప్రాంతాల్లో కల్వర్టులు మూసివేయడంతో వరద నీరు రోడ్డుపై నిలిచిపోయింది. భారీ వరదలతో పలు గ్రామాల రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్లపై నుంచి వరదలు పారడంతో రోడ్డు, మట్టి కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల పంటలను నీట మునిగి దెబ్బతిన్నాయి.

తెగిన ఎర్రకుంట కట్ట

మొయినాబాద్‌ రూరల్‌: శుక్రవారం ఉదయం, సాయంత్రం 3గంటల నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. నీటితో నిండిన బాకారం ఎర్రకుంట చెరువు ఒక్కసారిగా తెగిపోయి కుంటలోని నీరంతా పల్లానికి ప్రవహించింది. దీంతో బాకారం, ఎన్కేపల్లి రహదారి దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోయింది. వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్‌ డీఈ పరమేశ్వరచారి బాకారంలోని ఎర్రకుంటను సందర్శించి పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కట్టకు మరమ్మతులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సాయంత్రం 3 గంటల నుంచి ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. దీంతో గ్రామాలు తడిసిముద్దైయ్యాయి. రోడ్లన్ని జలమయమైయ్యాయి. తెల్లవారుజామున కురిసిన వర్షానికి అప్పటికే వర్షం నీటితో నిండి ఉన్ప రోడ్లు, గుంతలు సాయంత్రం కురిసిన వర్షానికి మరింత వర్షం నీరు చేరింది.

షాద్‌నగర్‌లో సహాయక చర్యలు

షాద్‌నగర్‌: పట్టణంలో భారీగా వర్షం కురియడంతో లోతట్టుకాలనీలు జలమయమయ్యాయి. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురియడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. కాలనీల్లో మురుగు కాల్వలు ఉప్పొంగాయి. వర్షం నీరు ఇళ్ళలోకి చేరయడంతో రాత్రివేళల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మున్సిపల్‌ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు కాలనీల్లో మున్సిపల్‌ కమిషనర్‌ సునీత పర్యటించి సహాయక చర్య లు చేపట్టారు. బీజేపీ నేత అందె బాబయ్య నాయకులు లోతట్టు కాలనీల్లో పర్యటించారు.

మెట్ట పంటలకు జీవం

యాచారం: మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి, శుక్రవారం సాయంత్రం సమయాల్లో మోస్తారు వర్షం కురిసింది. ఈ వర్షంతో మెట్ట పంటలకు భారీ ఉపశమనం లభించింది. పక్షం రోజులుగా వర్షాలు లేక పత్తి, కంది, జొన్న, మొక్కజొన్న తదితర మెట్ట పంటలు వాడిపోయే దశకు చేరాయి. రెండు రోజులుగా కురిసిన వర్షంతో మెట్ట పంటలకు జీవం పోసినట్లయింది. యాచారం, అయ్యవారిగూడెం, నందివనపర్తి, మొండిగౌరెల్లి, చింతపట్ల తదితర గ్రామాల్లో రెండు గంటల పాటు వర్షం కురిసింది.

నీటమునిగిన కాలనీలు

మీర్‌పేట: శుక్రవారం కురిసిన భారీ వర్షానికి మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. మిథులానగర్‌, కమలానెహ్రూనగర్‌ కాలనీలను వరదనీరు ముంచెత్తడంతో వీధుల్లో మోకాలి లోతు వరకు నీరు చేరాయి. కార్పొరేషన్‌ అధికారులు, సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి వరదనీరు వెళ్లేలా చర్యలు చేపట్టారు.

మంగళ్‌పల్లిలో అత్యధిక వర్షపాతం

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఆదిబట్ల మున్సిపాలిటీలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. మూడు గంటలకు పైగా ఆగకుండా వర్షం కురవడంతో రోడ్లుపై వరదలు పారాయి. కొంగరకలాన్‌లోని ఇళ్లలోకి నీరు చేరింది. పెద్దబంధం కాల్వ నుంచి దాతార్‌ చెరువులోకి భారీగా వరద నీరు రావడంతో కొంగరకలాన్‌–ఎల్మినేడు మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మున్సిపల్‌ పరిధిలోని మంగళ్‌పల్లిలో 85.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

మొయినాబాద్‌లో కుండపోత

పొంగి పొర్లిన వాగులు, వంకలు

పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌

కూలిన ప్రహారీలు.. విరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement