
ఆ స్థలాన్ని వదులుకునేది లేదు
ఉప్పల్ క్రికెట్ స్టేడియం గేట్ల వద్ద ప్రైవేట్ సంస్థ ప్రహరీ నిర్మాణం
● స్టేడియం గేట్లకు గోడలు అడ్డుగా ఉన్నాయని తొలగింపు
● ఘటనా స్థలానికి చేరుకున్న వీహెచ్, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్
● సదరు భూమిని కాపాడుకుంటామన్న కాంగ్రెస్, బీజేపీ నేతలు
● నాటకీయ పరిణామాల మధ్య ప్రహరీ కూల్చివేతలు
ఉప్పల్: నగరలోని ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద బుధవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్రికెట్ స్టేడియం వద్ద ఓ ప్రైవేట్ సంస్థ ప్రహరీ నిర్మించి గేట్లు మూసివేశారన్న సమాచారంతో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు ఉప్పల్ మున్సిపల్ మాజీ చైర్మన్ మేకల శివారెడ్డితో కలిసి ఉదయమే తన అనుచరులతో స్టేడియం ఆవరణలోకి వచ్చారు. ఉప్పల్ ఐలా అధికారులకు సమాచారం ఇచ్చారు. నిర్మించిన ప్రహరీని వెంటనే తొలగించాలని చెప్పడంతో ఐలా మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గేట్లకు అడ్డుగా ఉన్న ప్రహరీని తొలగించారు. ఈసందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. ఉప్పల్‌లో క్రికెట్ స్టేడియం ఏర్పాటుతోనే ఈ ప్రాంతానికి గుర్తింపు వచ్చిందని, స్థలాన్ని పోనివ్వమన్నారు. ప్రహరీని పూర్తిగా తొలగించే వరకు ఆయన అక్కడే బైఠాయించారు. స్వయంగా జేసీబీని తెప్పించి ప్రహరీని పూర్తిగా తొలగించే ప్రయత్నం చేయించడంతో పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత ఐలా ఆధ్వర్యంలో పూర్తిగా తొలగించడంతో వీహెచ్ అక్కడినుంచి అనుచరులతో కలిసి వెళ్లిపోయారు. కాగా.. మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సదరు స్థలం ఐలా అధీనంలోనే ఉందని, ఎలాంటి సంస్థకు అప్పగించ లేదన్నారు.
అందుకే కూల్చివేశాం..
ఉప్పల్ ఐలా కమిషనర్ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ.. సదరు స్థలం కోర్టు వివాదంలో ఉందన్నారు. ప్రస్తుతం అది ఐలా అధీనంలోనే ఉందని తెలిపారు. ప్రహరీ, స్టేడియం గేట్ల ముందు నిర్మించిన వాటికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతోనే కూల్చివేస్తున్నామన్నారు.
ఎందుకీ స్థల వివాదం?
ఉప్పల్ ప్రధాన రహదారిపై కొంత పారిశ్రామికవాడ స్థలం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇతరులతో పాటు పెంగ్విన్ టెక్స్‌టైల్స్‌కు కలిపి 46 ఎకరాల స్థలాన్ని కేటాయించిది. అందులో కొన్నాళ్లు పరిశ్రమ నడిపించిన సంస్థ లాకౌట్ చేసి వెళ్లిపోయింది. పరిశ్రమ నెలకొల్పే సమయంలో బ్యాంక్ నుంచి రుణాలు పొందింది. లాకౌట్ కారణంగా రుణం ఇచ్చిన బ్యాంకు సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఇందులో నుంచి 16 ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వ చొరవతో ఏపీఐఐసీ ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కేటాయించింది. స్టేడియం నిర్మాణ సమయంలోనే అదనంగా 7 ఎకరాల 20 గుంటల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టింది. కాగా.. అది కూడా వివాదం కావడంతో పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకుని రెగ్యులరైజ్ చేయించినట్లు సమాచారం. మిగిలిన 22.5 ఎకరాల స్థలాన్ని ఓ ప్రైవేట్ సంస్థ వేలం ద్వారా దక్కించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం.

ఆ స్థలాన్ని వదులుకునేది లేదు