
ప్రాణాలకు ప్రమాదం
చిన్న తప్పిదం..
భారీ వర్షాల వేళ చిన్న చిన్న తప్పిదాలతో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాస్తంత జాగ్రత్తలు పాటిస్తే వాటి నుంచి బయట పడొచ్చని విద్యుత్‌శాఖ అధికారులు తెలుపుతున్నారు.
కడ్తాల్: వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ వినియోగంపై అప్రమత్తతంగా ఉండాలని, సరైన జాగ్రత్తలు పాటించాలని ఆ శాఖ అధికారులు, సిబ్బంది సూచిస్తున్నారు. ప్రత్యేకించి వానలు పడేటప్పుడు చిన్నచిన్న పొరపాట్లతో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇళ్లు, పంట పొలాల్లో జాగ్రత్తలు పాటించక పోతే, ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి అనివార్యం అవుతుంది. ప్రస్తుతం వానలు పడుతుండడంతో రైతులు వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్ల వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కడ్తాల్ విద్యుత్ ఏఈ నరేందర్ సూచిస్తున్నారు.
అవగాహన ముఖ్యం
విద్యుత్ ప్రమాదాలపై రైతులకు, ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొన్ని చిన్న తప్పిదాలతో పెను ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముంది. రైతులు వ్యవసాయ పొలాల్లో, ప్రజలకు ఇళ్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్యం కల్పించాల్సిన అవశ్యకత ఉంది.
పాటించాల్సిన జాగ్రత్తలు
● రైతులు తమ పొలాలను సాగు చేసుకునే క్రమంలో విద్యుత్ మోటార్లలో ఏదైన సమస్య తలెత్తితే వారే మరమ్మత్తులు చేసుకుంటారు. ఇలా చేయకుండా ఉండాలి.
● విద్యుత్ మోటార్లు వాడేటప్పుడు ఒక ఫేజ్ కాలిపోతే, మోటారు మొత్తానికి విద్యుత్ ప్రవహిస్తుంది. ఆ సమయంలో మోటారును తాకకుండా ఉండాలి.
● ట్రాన్స్‌ఫార్మర్‌లో ఏబీ స్విచ్ పూర్తిగా నిలిచిపోతే విద్యుత్ సరఫరా జరిగి ప్రమాదం సంభవిస్తుంది. ఈ సమయంలో రైతులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి, బాగు చేయించాలి.
● మోటార్‌కు ఎర్తింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. మోటారును పరిరక్షించాలంటే టెస్టర్ ను వినియోగించాలి. వర్షానికి మోటారు తడవకుండా రేకు(గార్డు) అమర్చుకోవాలి. స్టార్టర్ స్వి చ్ఛాఫ్ బోర్డు కూడా తడవకుండా చూసుకోవాలి.
● పంట పొలాల వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లు, స్టార్టర్ బాక్సుల చుట్టూ పిచ్చి మొక్కలు, చెత్తచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.
● తెగిన విద్యుత్ తీగల పట్ల అప్రమత్తంగాా ఉండాలి. అలాంటివి ఉంటే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి.
● వర్షకాలంలో ఇనుప స్తంభాలను తాకవద్దు.
● ఇళ్ల వద్ద ఉతికిన బట్టలు ఆరేసుకునేందుకు ఇనుప తీగలను వినియోగించరాదు.
● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసినప్పుడు డిష్ కనెక్షన్ తీయాలి.
● విద్యుత్ తీగలు కిందకి వాలిన సమయంలో విద్యుత్‌శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.
● రేకుల ఇళ్లు, తడిసిన గోడలను విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదం ఉంది. అక్కడ విద్యుత్ తీగలు తేలకుండా చూసుకోవాలి.
వర్షాకాలం విద్యుత్‌తో జర భద్రం
రైతులు, గృహ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి
అవగాహన కల్పిస్తున్న అధికారులు

ప్రాణాలకు ప్రమాదం

ప్రాణాలకు ప్రమాదం