
విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట
కడ్తాల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని మైసిగండి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. అక్కడ రూ.6 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం యూనిఫామ్స్, నైట్ డ్రెస్, స్పోర్ట్స్ డ్రెస్, నోట్, పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని, క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలనలో విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు 200 శాతం, మెస్ చార్జీలు 40శాతం పెంచిందని గుర్తుచేశారు. పాఠశాల ఆవరణలో రూ.2.70 కోట్లతో నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్ పాఠశాలకు మైక్‌సెట్, క్రీడా సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ యాటగీత, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి