
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
కొత్తూరు: రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొత్తూరు పట్టణంలో గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ మల్లేష్ తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా తొత్తరమూడి గ్రామానికి చెందిన బొక్క సురేష్(17) ఇటీవల కొత్తూరు పట్టణంలోని రాఘవేంద్ర హోటల్‌లో పనిచేస్తున్న తన అన్న ప్రసాద్ వద్దకు వచ్చాడు. కాగా ఈ నెల 23న సాయంత్రం వేళలో అన్నకు చెప్పకుండా బయటకు వెళ్లి రైలు పట్టాలపై విగతజీవిగా పడి ఉన్నాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతుడు ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. ఉదయం విషయం తెలుసుకున్న మృతుడి అన్న షాద్‌నగర్ ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించాడు. ఇటీవల మృతుడు బెట్టింగ్ యాప్‌ల కారణంగా అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
ఇంట్లో నుంచి వెళ్లి..
షాద్‌నగర్‌రూరల్: రైలు కింద పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి షాద్‌నగర్ పరిధిలోని సోలీపూర్ గ్రామ శివారులో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఫరూఖ్‌నగర్ మండలం గంట్లవెళ్లి గ్రామానికి చెందిన మంగళి శివకుమార్(35) ఇంట్లో నుంచి వెళ్లి, సోలీపూర్ గ్రామ శివారులోని పట్టాల పక్కన శవమై కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. శివకుమార్ మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఈ విషయమై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కల్తీ కల్లు తాగి వ్యక్తి మృతి
మూసాపేట: కల్తీ కల్లు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లి, ఇందిరా హిల్స్‌కు చెందిన ఆడెబు విజయ్‌కుమార్ (35) రాపిడో బైక్ రైడర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 6న రాత్రి అతను సాయిచరణ్ కాలనీలో కల్లు తాగి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత వాంతులు చేసుకోవడంతో మర్నాడు కేపీహెచ్‌బీలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు 8న గాంధీ ఆసుపత్రికి, అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రైలు కింద పడి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
పోచారం: రైలు కిందపడి బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పోచారం మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. యాదా ద్రి జిల్లా, మానయిగూడెం గ్రామానికి చెందిన ఉప్పుల రాజేందర్ హాస్టల్‌లో ఉంటూ యంనంపేట్‌లోని శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. గురువారం అతను స్థానిక రైల్వే బ్రిడ్జి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.