
ఆర్టీసీ బస్సు నుంచి దింపివేత.. అంబులెన్స్ వచ్చేలోపు మృ
కేశంపేట: చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తున్న వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులను ఆర్టీసీ సిబ్బంది బస్సులో నుంచి దింపేశారు. ఆతర్వాత కొద్ది నిమిషాలకే బాధితురాలు మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కేశంపేటకు చెందిన నారని అనసూయమ్మ (64)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు సంతానం. భర్త రాములు మూడేళ్ల క్రితం, పెద్ద కూతురు ఎనిమిదేళ్ల క్రితం మృతిచెందారు. ప్రస్తుతం అనసూయమ్మ కేశంపేటలోనే కుమారుడి వద్ద ఉంటోంది. ఇటీవల ఆరోగ్యం బాగో లేకపోవడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పదిహేను రోజులుగా దగ్గు, దమ్ము అధికం కావడంతో మూడుసార్లు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరోసారి హైదరాబాద్ వెళ్లేందుకు అనసూయను తీసుకుని ఆమె కొడుకు, కోడలు మంగళవారం కేశంపేటలో ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సు కొత్తూర్ వద్దకు రాగానే అనసూయనకు దమ్ము ఎక్కువైందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది గమనించిన ఆర్టీసీ సిబ్బంది ముగ్గురినీ కిందకు దింపేశారు. బాధితులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా అంబులెన్స్ వచ్చే సరికే అనసూయ మృతిచెందారు.