
తారు.. బేజారు
యాచారం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌సిటీ నిర్మాణంతో యాచారం, కందుకూరు మండలాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని భావించిన స్థానికులకు నిరాశ తప్పడం లేదు. రహదారులు నిర్మించక పోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీకి భూసేకరణలో భాగంగా యాచారం–కందుకూర్ మండలాల మధ్యలో ఉన్న చిన్న రోడ్డును విస్తరించాలని సంకల్పించారు. ఈ రహదారిని వంద అడుగులకు విస్తరిస్తే ఫార్మాసిటీకి మార్గం సులువుతుందని అభిప్రాయం. అప్పట్లో 25 కిలోమీటర్ల రోడ్డుకు రూ.వంద కోట్లకు పైగా నిధులను టీజీఐఐసీ నుంచి మంజూరు చేశారు. కందుకూరు నుంచి మీరాఖాన్‌పేట గ్రామం సరిహద్దు వరకు రోడ్డు విస్తరణ అయింది. కానీ మండల పరిధిలోని నస్దిక్‌సింగారం, నందివనపర్తి, మొగుళ్లవంపు నుంచి యాచారానికి రహదారి పనులు ముందుకు కదలడం లేదు.
దుమ్ము, ధూళితో నరకం
మీరాఖాన్‌పేట గ్రామం సరిహద్దు నుంచి నస్దిక్‌సింగారం వరకు వంద అడుగుల రోడ్డు విస్తరణ కోసం గత నాలుగేళ్ల కింద పనులు ప్రారంభించారు. రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించి, రోడ్డుపై మట్టి పోశారు. కానీ పనుల్లో కదలిక లోపించింది. యాచారం–కందుకూర్ మండలాల సరిహద్దు కలిపే ఈ రోడ్డుపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఫ్యూచర్‌సిటీ నిర్మాణం, భూసేకరణ ప్రక్రియలో భాగంగా తరచూ రెవెన్యూ, టీజీఐఐసీ, పోలీస్ ఉన్నతాధికారులు ఈ రోడ్డు నుంచే నక్కర్తమేడిపల్లి, తాడిపర్తి, కుర్మిద్ద, నానక్‌నగర్ గ్రామాల్లో పర్యటిస్తారు. రోడ్డుపై పోసిన మట్టి ఎండలకు దుమ్ము లేస్తుంది. బైక్‌లపై వెళ్లే ప్రయాణికులకు కళ్లు, నోట్లోకి పోయి శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి. రోడ్డు విస్తరణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కందుకూరు మండలంలో చకచక రహదారి పనులు జరిగితే ఇక్కడ మాత్రం నత్తతో పోటీ పడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం విషయంలో పెంచాలని కోరుతున్నారు.
ఐదేళ్లయినా గ్రహణంవీడని ఫార్మాసిటీ రోడ్డు
కందుకూరులో కళకళ
యాచారంలో వెలవెల
అవస్థలు పడుతున్న వాహనదారులు

తారు.. బేజారు