
సీఐటీయూ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
ఇబ్రహీంపట్నం: దేశ వ్యాప్తంగా బుధవారం నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఇబ్రహీంపట్నం మండలంలో బైక్ ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద కార్మికులతో కలిసి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్మికులు, కర్షకులు పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ నేతలు కోరారు. కార్యక్రమంలో నాయకులు ఎల్లేశ్, స్వప్న, వీరేశం, దుర్గయ్య, వెంకటయ్య, ఆర్టీసీ డిపో ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు నర్సింహ, జంగయ్య, దిలీప్ పాల్గొన్నారు.
కల్లు కాంపౌండ్‌లో బాలిక కిడ్నాప్
శంషాబాద్: కల్లుకాంపౌండ్ వద్ద ఓ చిన్నారిని మచ్చిక చేసుకున్న గుర్తు తెలియని మహిళ బాలికను కిడ్నాప్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్‌జీఐ ఎస్‌ఐ బాలరాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబ్‌నగర్ జిల్లా, మిడ్చిల్ మండలం, కంచన్‌పల్లి గ్రామానికి చెందిన లక్షమ్మ తన కుమార్తెలు కీర్తన (6) అర్చన్ (3)తో పాటు తమ మావతో కలిసి ఈ నెల 1న శంషాబాద్ కల్లు కంపౌండ్‌కు వచ్చింది. కల్లు తాగుతున్న క్రమంలో ఎదురుగా కూర్చున్న గుర్తు తెలియని మహిళ లక్షమ్మ కుమార్తె కీర్తనను దగ్గరకు తీసుకుని మాటలు కలపడంతో పాటు కల్లు తాగించింది. అనంతరం కంపౌండ్ బయట తినడానికి ఏమైనా ఇప్పిస్తానని తల్లికి చెప్పి చిన్నారిని తీసుకుని బయటికి వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో లక్ష్మమ్మ పరిసర ప్రాంతాల్లో గాలించింది. గ్రామానికి వెళ్లిపోయిన అనంతరం వారి కుటుంబసభ్యుల సూచన మేరకు మంగళవారం ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా మధ్యవయస్సురాలైన ఓ మహిళ కీర్తనను వెంటబెట్టుకుని వెళ్లిన ట్లు గుర్తించారు. మూడు బృందాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు.
థ్యాంక్యూ..సీఎం సార్..
పారదర్శకంగా పదోన్నతులు,
పోస్టింగ్‌లపై హర్షం
సాక్షి, సిటీబ్యూరో: త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని, పారదర్శకంగా పోస్టింగ్‌లు ఇవ్వడం పట్ల వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా.కిరణ్ బొల్లేపాక, కార్యదర్శి మాదాల కిరణ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహలకు ధన్యవాదాలు తెలిపారు. దశాబ్దంగా ఎన్నడూ పోస్టింగ్‌లు, పదోన్నతులు ఇంత పారదర్శకంగా జరిగినట్లు చూడలేదన్నారు. ప్రొఫెసర్ల పదోన్నతులను పరిగణలోకి తీసుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమస్యలకు పరిష్కారం లభించిందని వారు పేర్కొన్నారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ