
వైభవంగా శోభాయాత్ర
కందుకూరు: గురు పూర్ణిమ మహోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రాష్ట్రాల నుంచి పాదయాత్ర, సైకిల్ యాత్రగా తరలివచ్చిన సాధకులతో బ్రహ్మశ్రీ గురూజీ అనిల్‌కుమార్‌జోషి ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రం నుంచి పులిమామిడిలోని శ్రీనిఖిల్ చేతనా కేంద్రం వరకు చేపట్టిన రథయాత్ర, పల్లకీ సేవ శోభాయమానంగా కొనసాగింది. రథంపై పరమ పూజ్య సద్గురు స్వామి నిఖిలేశ్వరానంద విగ్రహాన్ని కొలువుదీర్చిన గురూజీ శోభాయాత్రను ప్రారంభించారు. డప్పు వాయిద్యాలు, భక్తి గీతాలు, నృత్యాల నడుమ సాధకులు పెద్ద ఎత్తున పాల్గొని పల్లకీ సేవ, రథంతో పాటు నిఖిల్ చేతనా కేంద్రం వరకు పాదయాత్ర చేపట్టారు. కందుకూరు చౌరస్తా నుంచి ప్రారంభించి కొత్తగూడ, జైత్వారం, పులిమామిడి గ్రామాల మీదుగా యాత్ర కొనసాగగా భక్తులు నీరాజనాలు పలికారు. ఆశ్రమానికి చేరుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి గురూజీ ప్రవచనాలు చేసి, భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు ఆశీర్వాదాలు అందించారు. బుధ, గురువారాల్లో శ్రీనిఖిల్ చేతనా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

వైభవంగా శోభాయాత్ర