అక్రమ నిర్మాణం.. సక్రమ నంబర్లు | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణం.. సక్రమ నంబర్లు

Jul 8 2025 7:14 AM | Updated on Jul 8 2025 7:14 AM

అక్రమ

అక్రమ నిర్మాణం.. సక్రమ నంబర్లు

కొత్తూరు: చట్టాల్లోని లొసుగలతో కొందరు రియల్‌ వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. యథేచ్ఛగా అక్రమంగా భారీ భవనాలు, పరిశ్రమలు నిర్మిస్తూ కోట్లాది రూపాయాలు కొల్లగొడుతున్నారు. అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అరికట్టాల్సిన అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. తీరా నిర్మాణాలు పూర్తయిన తరువాత సక్రమమని పేర్కొంటూ.. ఇంటి నంబర్లు కేటాయిస్తూ.. పరోక్షంగా అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు.

అధికారుల కళ్లెదుటే..

కొత్తూరు మున్సిపాలిటీలో నివాస గృహాల నిర్మాణాల కోసం ఏర్పాటు చేసిన ప్లాట్లలో ఇటీవల కొందరు షెడ్లను నిర్మించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా అన్ని అనుమతులు పొందాలి. లేదంటే మున్సిపల్‌ సిబ్బంది సదరు నిర్మాణాలకు నోటీసు జారీ చేసి, పనులను నిలిపివేస్తారు. కాగా దీనికి భిన్నంగా పురపాలికలో అధికారుల కళ్లెదుటే అక్రమ నిర్మాణాలు భారీగా వెలుస్తున్నాయి. ముడుపులు, పెద్దల ఒత్తిళ్ల కారణంగా అక్రమ నిర్మాణాల పట్ల అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. తీరా నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఇంటి నంబర్లు కేటాయిస్తు, పరోక్షంగా వారికే సహకరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

నగరం నుంచి శివార్లకు

హైదరాబాద్‌ మహానగర అభివృద్ధిలో భాగంగా పట్టణం సమీపంలో కొనసాగుతున్న కాలుష్య కారక పరిశ్రమలను అక్కడి నుంచి తరలించాలని నిర్వాహకులకు నోటీసులు అందజేశారు. దీంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులు నగర శివారులోని కొత్తూరు, నందిగామ, షాద్‌నగర్‌ ప్రాంతాల్లో రెండు నుంచి పదెకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తూ.. కర్మాగారాలను నెలకొల్పుతున్నారు.

మోసాలు.. రకాలు

● కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారు.. కొనుగోలు చేసిన వ్యవసాయ భూములను సాగుయేతర భూమిగా మార్చుకోవాలి. అందుకు ప్రభుత్వం నిర్ణయించిన పన్ను చెల్లించాలి. కానీ సదరు యజమానులు.. పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. పదెకరాల స్థలానికి కేవలం రెండుమూడు ఎకరాలను మాత్రమే వ్యవసాయేతర భూమిగా మార్చుకుంటున్నారు.

● పరిశ్రమల ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ, గ్రామ పంచాయతీతో పాటు అన్ని శాఖల నుంచి అనుమతి పొందాలి. ఇక్కడ మాత్రం కేవలం బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం పొందేందుకు వీలుగా ఉన్న అనుమతులను పొందుతున్నారు.

● పరిశ్రమల నిర్మాణాలకు సంబంధించిన పత్రాలను పంచాయతీకి అందజేయాలి. దాని ఆధారంగా ఏటా పన్నులు వసూలు చేస్తారు. కానీ నిర్వాహకులు మాత్రం పూర్తిస్థాయి పత్రాలను ఇవ్వడం లేదు. దీంతో పన్నులు తక్కువగా వసూలు అయ్యే అవకాశం ఉంది.

● అప్పటికే కొనసాగుతున్న పరిశ్రమల్లో తదుపరి అవసరాల కోసం కొత్తగా చేపట్టే నిర్మాణాలకు అనుమతి తీసుకునేందుకు వ్యాపారులు నిర్లక్ష్యం చేస్తున్నారు.

● షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటవుతున్న పరిశ్రమలు.. తాము టీఎస్‌ ఐపాస్‌లో దరఖాస్తు చేసుకున్నాం. అన్ని అనుమతులు ఉన్నాయని ప్రకటిస్తున్నప్పటికీ.. గేటు బయట పరిశ్రమల పేర్లను మాత్రం నమోదు చేయడం లేదు.

అనుమతుల్లేకుండావెలుస్తున్న కట్టడాలు

కొలువుదీరుతున్న పరిశ్రమలు

ప్రభుత్వ ఆదాయానికి గండి

అక్రమార్కులకు అండగా నిలుస్తున్న అధికార యంత్రాంగం!

చర్యలు తప్పవు

మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టి ఆర్థికంగా నష్టపోవద్దు. విచారణలో అక్రమం అని తేలితే చర్యలు తప్పవు. ఇప్పటికే పర్మిషన్‌ లేకుండా నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు జారీ చేశాం. గడువులోగా స్పందించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అనుమతి లేకుండా నిర్మించిన వాటికి నంబర్లు కేటాయించిసప్పటికీ.. అధిక పన్నులు వసూలు చేస్తాం.

– బాలాజీ, మున్సిపల్‌ కమిషనర్‌, కొత్తూరు

చిన్నవారిపైనే పెత్తనం

ప్రభుత్వ అనుమతులు లేకుండా చిన్న షెడ్డును నిర్మించిన వారిపై చర్యలు తీసుకునే అధికారులు.. ఏకంగా పరిశ్రమలను నెలకొలిపి, అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొత్తూరు మున్సిపాలిటీ, మండలంలో కొత్తగా నిర్మాణం చేపడుతున్న గోదాములు, పరిశ్రమలు, ఇప్పటికే కొనసాగుతున్న వాటి వివరాలు అధికారులకు తెలుసు. అయినా.. వాటిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారని విమర్శిస్తున్నారు.

అక్రమ నిర్మాణం.. సక్రమ నంబర్లు 1
1/1

అక్రమ నిర్మాణం.. సక్రమ నంబర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement