
యువతి అదృశ్యం
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ సర్దార్‌నగర్‌కు చెందిన రెడ్డిగళ్ల రత్నం కుమార్తె లక్ష్మీ ప్రసన్న(22) విద్యార్థి. గత జూన్ 30వ తేదీన ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిన ప్రసన్న తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ కోసం వెతికినా జాడ తెలియలేదు. యాచారం ప్రాంతానికి చెందిన అంకని సాయికుమార్ తీసుకెళ్లి ఉంటాడని ఆమె తల్లి రాజ్యలక్ష్మి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతి ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్‌లో సమాచారం ఇవ్వాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.
లారీ, కారు ఢీ
ఐదుగురికి గాయాలు
కొత్తూరు: లారీ–కారు ఢీకొని ఐదుగురు గాయపడిన సంఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధి తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ కూడలిలోని హెచ్‌ఐఎల్ పరిశ్రమ ఎదురుగా శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ నర్సింహారావు తెలిపిన వివరాల మేరకు.. షాద్‌నగర్ పట్టణానికి చెందిన అవినాష్‌గౌడ్, శ్రావణి, వినయ్, నవీన్‌గౌడ్, కారు డ్రైవర్ శివకృష్ణలతో కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉద్యోగం చేస్తున్న సంస్థకు బయలు దేరారు. మార్గమధ్యలో తిమ్మాపూర్ శివారు హెచ్‌ఐఎల్ పరిశ్రమ ఎదురుగా రోడ్డుపై నిలిపిన లారీను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ పేర్కొన్నారు.
ముగ్గురు సైబర్ నేరగాళ్లకు అరదండాలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నమోదైన వేర్వేరు కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి వాట్సాప్ ద్వారా ఎర వేసిన సైబర్ నేరగాళ్లు భారీ లాభాలు వచ్చే ట్రేడింగ్ అంటూ నమ్మించారు. ఆపై ఆయన నుంచి రూ.67.60 లక్షలు కాజేసి మోసం చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన అధికారులు ఈ మొత్తంలో కొంత గుజరాత్‌కు చెందిన హార్థిక్ కుమార్ పేరుతో ఉన్న ఖాతాలోకి వెళ్లినట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లిన బృందం అతడిని అదుపులోకి తీసుకుని విచారించింది. ప్రైవేట్ ఉద్యోగి అయిన ఇతగాడు స్క్రాప్ వ్యాపారి దేవ్‌రాజ్ భాయ్ కోరడంతో తన పేరుతో తెరిచిన బ్యాంకు ఖాతా వివరాలు అందించినట్లు వెలుగులోకి వచ్చింది. దీని ద్వారా జరిగే లావాదేవీలపై కమీషన్ పొందుతున్నాడని తేలింది. దీంతో పోలీసులు దేవ్‌రాజ్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు సెల్‌ఫోన్లు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదే రకమైన మరో మోసంలో నగరవాసి నుంచి రూ.6.16 లక్షలు కాజేసిన కేసులో అకౌంట్ హోల్డర్‌గా ఉన్న ఉత్తరాఖండ్ వాసి మనీష్ కుమార్ శర్మనూ పోలీసులు పట్టుకున్నారు.

యువతి అదృశ్యం