
సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి
ఇబ్రహీంపట్నం రూరల్: సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. అర్జీలను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూకు సంబంధించి 32, ఇతర శాఖలకు సంబంధించి 41, మొత్తం 73 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల తహసీల్దారులు, మున్సిపల్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
రాజీవ్ యువ వికాసం అమలు చేయాలి
రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.జగన్ డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 2న నిధులు మంజూరు చేస్తామని ప్రకటించి వాయిదా వేయడంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ పెంచి అర్హులైన వారందరికీ పథకాన్ని వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అలంపల్లి జంగయ్య, గజ్జెల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
● అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్