● అనుమతులు లేని ఆస్పత్రులపై కొరడా ● తనిఖీల్లో పట్టుబడ్డ నకిలీ వైద్యులు
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ విభాగాల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. విద్యార్హతలు అసలే లేవు. అయినా వైద్యులుగా చలామణి అవు తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంపౌండర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు కొరడా ఝులిపించారు. సోమవారం షాబాద్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వైద్యుల బృందం ఏడు క్లినిక్‌లపై కేసులు నమోదు చేసింది. ఓం సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, శ్రావణ్ ఫస్ట్‌ఎయిడ్ సెంటర్, మధు శ్రీ క్లినిక్, ముస్తాఫా క్లినిక్, మాస్టర్ క్లినిక్, శ్రీ సాయితిని, జంజం క్లినిక్‌లకు అనుమతులు లేవని గుర్తించింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డా.మహేశ్‌కుమార్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. జంజం క్లినిక్‌లో వందల సంఖ్యలో డైకోఫెన్స్ సోడియం ఇంజక్షన్లు, కాల్షియం గ్లూకోనేట్ ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్ ఇంజక్షన్లు గుర్తించినట్టు తెలిపారు. కనీస అర్హత లేకుండా అల్లోపతి దవాఖానా నిర్వహిస్తున్నారని అన్నారు. రోగంతో సంబంధం లేకుండా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, మాత్రలను అధిక మోతాదులో ఇస్తున్నారని పేర్కొన్నారు. చట్ట ప్రకారం ఎంబీబీఎస్ వైద్యులు మాత్రమే మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేయించుకుని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నారు. అర్హత లేని వ్యక్తులు వైద్యం చేసినట్లైతే ఎన్‌ఎంసీ చట్టం 34, 35 ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు రూ.5 లక్షల జరిమానా, ఏడాది జైలు శిక్ష విధిస్తామని వెల్లడించారు. మెడికల్ స్టోర్స్‌లో క్వాలిఫైడ్ వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఫార్మసిస్ట్‌లు లేకుండా యాంటిబయాటిక్స్, స్టెరాయిడ్, ఇతర షెడ్యూల్ డ్రగ్స్ విక్రయిస్తునట్టు గుర్తించామని తెలిపారు. సంబంధిత రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్‌లపై డ్రగ్ కంట్రోల్ అథారిటీతో పాటు ఫార్మసీ కౌన్సిల్‌కి ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు.