
యువత వ్యసనాల బారిన పడొద్దు
యాచారం: యువత చెడు అలవాట్లకు గురై జీవితాలను నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు సూచించారు. పీఎస్ పరిధిలోని కుర్మిద్ద గ్రామంలో ఆదివారం సాయంత్రం గంజాయి, డ్రగ్స్ నియంత్రణ, రోడ్డు నిబంధనలు, ఘర్షణల వల్ల జీవితాల నాశనం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువతనేనని, అలాంటి వారు వ్యసనాలకు గురై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గొప్ప లక్ష్యంతో యువత ఆసక్తి కలిగిన రంగాల్లో రాణించాలని సూచించారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో కేసులు నమోదుతో పాటు జరిమానాలు విధిస్తామన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, బంధువుల ఇళ్లకు, శుభకార్యాలకు వెళ్లేటప్పుడు విలువైన వస్తువులు, బంగారు నగలను ఇంట్లో ఉంచి వెళ్లరాదని సూచించారు. సమావేశంలో రాచకొండ సీఐ జోసఫ్, ఎస్‌ఐ తేజంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు