
కొరత చూపి.. రైతులను దోచేసి
కొందుర్గు: ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతులు పత్తి, మొక్కజొన్న, వరి తదితర పంటల సాగు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందుకోసం ప్రస్తుతం మొదటి దఫా అధికంగా రైతులు డీఏపీ వాడుతారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీఏపీ బస్తా ధర రూ.1,350 ఉంటే డీలర్లు రూ.1,500 వరకు అన్నదాతలకు విక్రయిస్తున్నారు. అదే విధంగా యూరియా బస్తా ధర రూ.266 ఉండగా రూ.300 పైనే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోనే కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లో అధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తారు. ఇక్కడ పత్తి, మొక్కజొన్న పంటలను అధికంగా సాగు చేస్తారు. కానీ ప్రస్తుతం డీఏపీ, యూరియా కొరత సృష్టించడంతో తాము అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేసి నష్టపోతున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వ్యవసాయాధికారులను వివరణ కోరగా డీఏపీ కొరత ఉన్నది వాస్తవమేనని, వాటి స్థానంలో కాంప్లెక్స్ ఎరువులు వాడా లని సూచిస్తున్నారు. కాగా కాంప్లెక్స్ ఎరువులు మొదటి దఫాలో వాడడంతో పంటలు బాగా పెరిగి చీడపీడలకు గురయ్యే ప్రమాదం ఉంటుందని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.
అధిక ధరలకు ఎరువుల విక్రయాలు వానాకాలం సాగులో ఇక్కట్లు