ఎఫ్‌టీఎల్‌లో ఇళ్లు! | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌టీఎల్‌లో ఇళ్లు!

Jun 29 2025 7:24 AM | Updated on Jun 29 2025 7:24 AM

ఎఫ్‌టీఎల్‌లో ఇళ్లు!

ఎఫ్‌టీఎల్‌లో ఇళ్లు!

తుర్కయంజాల్‌: చెరువులు, కుంటల పరిరక్షణకు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపడుతున్నా కొందరు అధికారుల తీరులో మార్పు కనిపించడం లేదు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లను పరిశీలించకుండానే అనుమతులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. తుర్కయంజాల్‌ మున్సిపల్‌ పరిధిలోని ఇంజాపూర్‌, తుర్కయంజాల్‌, మన్నెగూడ, తొర్రూర్‌, మునగనూర్‌, కొహెడ రెవెన్యూలోని అనేక చెరువులు, కుంటల పరిధిలో పలు నిర్మాణాలకు అధికారులు అనుమతులు జారీ చేయడం, అవి ఆలస్యంగా బయటకు పొక్కుతుండడం చర్చకు దారితీస్తున్నాయి.

ఎఫ్‌టీఎల్‌లోనే వెంచర్‌

ఇంజాపూర్‌లోని సర్వే నెంబర్లు 96, 97, 98, 99, 100, 104, 105లో 15.9 ఎకరాల ఎఫ్‌టీఎల్‌, 2.10 ఎకరాల బఫర్‌ జోన్‌తో గుడెం కుంట చెరువు విస్తరించి ఉంది. 2017లో హెచ్‌ఎండీఏ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ చేసి, 2024 సెప్టెంబర్‌లో ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. కొన్నేళ్ల క్రితం నగరానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు తనకున్న అధికార బలంతో ఎఫ్‌టీఎల్‌ పరిధిలో వెంచర్‌ చేశాడు. ఆ తరువాత యథేచ్ఛగా ప్లాట్లను విక్రయించాడు.

యథేచ్ఛగా ఇంటి నిర్మాణ అనుమతులు

2023 డిసెంబర్‌, 2024 జనవరిలో 12 ప్లాట్లకు ఎన్‌ఓసీలు లేకుండానే అప్పటి టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, కమిషనర్‌ ఇంటి నిర్మాణ అనుమతులు జారీ చేశారు. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇది తెలుసుకున్న పలువురు స్థానికులు పలుమార్లు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. 18 నెలలు పూర్తి అవుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వీటిని రద్దు చేసే విషయంలో వెనకడుగు వేస్తుడటం సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది.

ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించేందుకు విఫలయత్నం

ఇటీవల ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌–2020లో దరఖాస్తు చేసుకున్న వారు రాయితీపై ఫీజు చెల్లించే అవకాశం కల్పించడంతో ఈ లే అవుట్‌లోని ప్లాట్ల యజమానులు చెల్లించేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. దీంతో గతంలో మాదిరిగా అధికారులనే ప్రసన్నం చేసుకుని అనుమతులు పొందాలని భావించి పలు ప్లాట్లకు డబ్బులు సైతం చెల్లించారనే ప్రచారం సాగుతోంది. అధికారులు వినకపోవడంతో ఓ ప్రజా ప్రతినిధితో చెప్పించేందుకు యత్నించారని గుసగుసలు వినిపించాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఎఫ్‌టీఎల్‌ పరిధిలో జారీ చేసిన నిర్మాణ అనుమతులను రద్దు చేయడంతో పాటు, చెరువును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

గుడెం కుంట చెరువు

పరిశీలించిన తర్వాతే అనుమతులు

చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ల పరిధిలో మున్సిపల్‌ అధికారులు ఇంటి నిర్మాణ అనుమతులు జారీ చేయవద్దు. గతంలో జారీ చేసిన వాటిని రద్దు చేసే అధికారం వారికే ఉంది. ఇప్పటికే అన్ని చెరువులకు సంబంధించిన మ్యాప్‌లను అధికారులకు అందజేశాం. వీటిని పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలి.

– వంశీ, ఇరిగేషన్‌ ఏఈఈ, అబ్దుల్లాపూర్‌మెట్‌

చర్యలు తీసుకుంటాం

గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు గుడెం కుంటలో ఇంటి నిర్మాణ అనుమతులు జారీ చేసిన విషయం ఆలస్యంగా తెలిసింది. దీనిపై విచారణ చేపడుతున్నాం. ప్లాట్లను పరిశీలించాక తగిన చర్యలు తీసుకుంటాం. ఇంటి నిర్మాణ అనుమతులను రద్దు చేస్తాం. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలను చేపట్టవద్దు.

– కె.అమరేందర్‌ రెడ్డి,

కమిషనర్‌, తుర్కయంజాల్‌

అధికార బలంతో వెంచర్‌

2023–24లో అనుమతులు ఇచ్చిన టీపీఓ, కమిషనర్‌

రద్దు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం

గుడెం కుంటను కాపాడలని స్థానికుల వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement