
ఆలయాలకు దారి మూసేయడం తగదు
పహాడీషరీఫ్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నగర శివారులోని విలువైన ప్రభుత్వ భూములను విక్రయించడమే పనిగా పెట్టుకుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి విమర్శించారు. శనివారం ఆమె గ్రామస్తులతో కలిసి హౌజింగ్ బోర్డు అధికారులు ప్రీ కాస్ట్ గోడలను నిర్మిస్తున్న మామిడిపల్లిలోని దొంతరాల గుట్టపై ఉన్న మల్లన్న స్వామి, ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయానికి వెళ్లకుండా అధికారులు ప్రహారీ నిర్మిస్తున్నారని స్థానికులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ ఎక్కడ ప్రభుత్వ భూములున్నాయో గుర్తించి, వాటిని అమ్మడమే ఎజెండాగా పెట్టుకుందన్నారు. హెచ్‌సీయూ భూముల విక్రయం వెలుగులోకి వచ్చి ఆగిపోవడంతో, చివరకు ఆ భూములను తాకట్టు పెట్టి బ్యాంక్‌లలో రూ.10 వేల కోట్లు రుణం తీసుకొచ్చిందన్నారు. ఇతర ప్రాంతాలలోని భూములను కూడా విక్రయించడంలో భాగంగానే రావిరాలలోని భూముల వద్దకు రావడంతో అడ్డుకున్నామన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణ సమయంలో మామిడిపల్లి రైతులు పెద్ద ఎత్తున పొలాలు ఇచ్చారన్నారు. ఇందులోని 50 ఎకరాలను ప్రభుత్వం హౌజింగ్ బోర్డుకు కేటాయించిందన్నా రు. రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వనందున, హౌజింగ్ బోర్డు అధికారులు స్థలాన్ని ఆధీనంలోకి తీసుకునే సమయంలో రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అప్పట్లోనే కోరామని గుర్తు చేశారు. విమానాశ్రయం నిర్మాణానికి ముందే ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకున్నారని, ప్రస్తుతం ఆలయానికి కూడా వెళ్లకుండా అధికారులు ప్రీ కాస్ట్ వాల్ నిర్మించడం సరికాదన్నారు. దేవాలయం జోలికి రావద్దని అధికారులకు సూచించారు. రావిరాల జొన్నాయిగూడలో లక్ష్మీనర్సింహ స్వామి ఆలయానికి గతంలో 30 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందని, ప్రస్తుతం అవసరం లేనప్పటికీ, పాత రోడ్డును వదిలేసి ఆలయు భూ ముల్లో నుంచి కొత్త రోడ్డు వేస్తున్నారన్నారు. అనంతరం ఆమె హౌజింగ్ బోర్డు అధికారులను ఫోన్‌లో సంపద్రించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పవన్ కుమార్ యాదవ్, శివకుమార్, ఆలయ కమిటీ ప్రతినిధులు నరేష్ యాదవ్, గోపాల్ యాదవ్, బాలరాజు యాదవ్, గ్రామస్తులు నందీశ్వర్, దశరథ, శ్రీనివాస్ రెడ్డి, రంగనాథ్, మహేందర్ యాదవ్, శంకర్ యాదవ్, చంద్రయ్య యాదవ్, ఎల్.శ్రీనివాస్, ఎన్.యాదగిరి, కె.బాబు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సబితారెడ్డి