
చోరీ కేసుల్లో రికవరీ పెరగాలి
● ఎప్పుడొస్తారో.. ఎప్పుడిస్తారో
ప్రతి నెల 1వ తేదీ నుంచి ఇవ్వాల్సిన పింఛన్లు పోస్టల్ సిబ్బంది నెలాఖరులో ఇస్తున్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్‌నగర్‌లో సుమారు 500 మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. ఈ నెలలో ఇవ్వాల్సిన పింఛన్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు. లబ్ధిదారులు నిత్యం మున్సిపల్ కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారు. శుక్రవారం సైతం ఇలా రోజంతా పడిగాపులు కాశారు. సాయంత్రం వరకు కూడా పోస్టల్ సిబ్బంది రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. – మొయినాబాద్
ఇబ్రహీంపట్నం రూరల్: చోరీ కేసుల్లో సొత్తు రికవరీ శాతం పెరగాలని, ఆ దిశగా పనిలో వేగం పెంచాలని రాచకొండ పోలీస్‌కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశించారు. ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ నిర్వహణకు సంబంధించి సీఐ రాఘవేందర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. మాదక ద్రవ్యాల కేసులో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయాలని సూచించారు. ఎన్‌బీడబ్ల్యూ కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. కేసుల ఛేదన, రిసెప్షన్ నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. మహిళా కేసుల విచారణ వేగవంతం చేయాలని చెప్పారు. రౌడీీషీట్ చెకింగ్, లాంగ్ పెండింగ్ కేసులు తేల్చాలని పేర్కొన్నారు. ఏడాది కాలంగా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ నిర్వహణ బాగుందని, చోరీ కేసుల్లో జోన్ పరిధిలో మంచి ఫలితాలు సాధించారని కితాబిచ్చారు. లోక్ అదాలత్‌లో కేసులు రాజీ చేయడంలో చొరవ బాగుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం మరింతగా శ్రమించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు రాజు, వెంకటేశ్, బాల్‌రాజ్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాచకొండ సీపీ సుధీర్‌బాబు
బోడకొండ గుట్టల సందర్శన
మంచాల: మండలంలోని బోడకొండ గుట్టలను శుక్రవారం రాచకొండ సీపీ సుధీర్‌బాబు సందర్శించారు. వాటర్‌ఫాల్స్‌ను పరిశీలించి స్థానిక పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాటర్‌ఫాల్స్ పూర్తిగా బండరాళ్లతో కూడి ఉందని, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాలకు ప్రమాదమని అన్నారు. ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అవసరమైతే పికెటింగ్ ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, మంచాల సీఐ మధు, ఎస్‌ఐ లాలయ్య తదితరులు ఉన్నారు.

చోరీ కేసుల్లో రికవరీ పెరగాలి