
ప్రభుత్వ భూములను పరిరక్షించండి
మహేశ్వరం: అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్ భూములను పరిరక్షించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎస్‌వీజే కన్వెన్షన్ హాలులో శుక్రవారం పార్టీ 12వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహేశ్వరం, కందుకూరు మండలాల్లో ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్ భూములు కబ్జాకు గురవుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. రూ.కోట్ల విలువ చేసే భూములు కొంత మంది కబ్జాదారుల చేతిలో ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కునే ప్రయ త్నాలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. మహేశ్వరం మండలంలోని రావిరాల కొంగరఖుర్దు, నాగిరెడ్డిపల్లి, కందుకూరు మండలం అన్నోజిగూడలో ఐటీ, ఎలక్ట్రానిక్ పార్కుల కోసం కార్పొరేట్ కంపె నీలకు కట్టబెట్టేందుకు రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటోందని మండిపడ్డారు. అంతకు ముందు ఆయన కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్రాచారి, రాష్ట్ర కమిటీ సభ్యుడు పానుగంటి పర్వతాలు, నియోజకవర్గ కన్వీనర్ దత్తు నాయక్, మండల కార్యదర్శి పల్నాటి యాదయ్య, కందుకూరు మండల కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.