
ఉద్యమ కళాకారులను ఆదుకోవాలి
హయత్‌నగర్: తెలంగాణ ఉద్యమంలో కళాకారులు ముందుండి పోరాటం చేశారని, వారికి తగిన గుర్తింపు ఇచ్చి ఆదుకోవాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, జిల్లా ఇన్‌చార్జి ముత్యాల యాదిరెడ్డి అన్నారు. కుంట్లూరు రావినారాయణరెడ్డి కాలనీలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజానాట్యమండలి జిల్లా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం సమగ్ర సాంస్కృతిక విధానాన్ని ప్రకటించాలని, కళాకారులకు గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు, పిల్లల చదువులకు ఫీజులో రాయితీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ నెల 30న జరిగే సదస్సులో కళాకారుల సమస్యలపై చర్చిస్తామని, తీర్మానాన్ని ఆమోదించి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. జిల్లా సహాయ కార్యదర్శి రాము అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండల కార్యదర్శి హరిసింగ్‌నాయక్, జిల్లా కార్యదర్శి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.