
ప్రభుత్వ పాఠశాల స్థలంలో ఇళ్ల నిర్మాణం
కూల్చివేయించిన రెవెన్యూ అధికారులు
చేవెళ్ల: ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య హెచ్చరించారు. నాంచేరి రెవెన్యూ పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్‌లో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఏడు ఇళ్లను శుక్రవారం పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఇంద్రారెడ్డి నగర్‌లో ప్రభుత్వ పాఠశాలకు సర్కార్ 2.20 ఎకరాల స్థలం కేటాయించింది. ఇక్కడ ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల కొనసాగుతోంది. చుట్టూ ఖాళీ స్థలం ఉండడంతో ఏడుగురు స్థానికులు ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ కృష్ణయ్య, ఆర్‌ఐలు చంద్రమోహన్, పవన్, సీఐ భూపాల్ శ్రీధర్, ఎస్‌ఐ సంతోష్‌కుమార్ వెళ్లి నిర్మాణాలను కూల్చివేశారు. ఈ కూల్చివేతల్లో రెవన్యూ సిబ్బంది నర్సింలు, ప్రకాశ్, ఆంజనేయులు, రవీందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నిర్మాణాల్లో అధికార పార్టీకి చెందిన నాయకుడి కుమారుడి ఇళ్లు ఉండడం విశేషం.
వీధి కుక్క స్వైర విహారం
కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం వాచ్చతండా గ్రామపంచాయతీ దేవులనాయక్‌తండాలో శుక్రవారం వీధికుక్క స్థైర్య విహారం చేసింది. తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులపై దాడిచేసి, గాయపరిచింది. మేకలు, కోళ్ల వెంటపడుతున్న కుక్కను నేనావత్ చందర్, సబావత్ సక్రీబాయ్ అదిలించే ప్రయత్నం చేయగా వారిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచిందని స్థానికులు తెలిపారు. పక్కనే ఉన్న ముడావత్ హర్షవర్ధన్(5)పై దాడిచేసి గాయపరిచిందని పేర్కొన్నారు. కుక్కల దాడిలో గాయపడిన వారిని చికిత్స కోసం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.
సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి
కుల్కచర్ల ఎస్‌ఐ రమేశ్
కుల్కచర్ల: దుకాణదారులు ప్రతీ ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవానలి కుల్కచర్ల ఎస్‌ఐ రమేశ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద కెమెరాలతో సమానమన్నారు. రోడ్డు ప్రమాదాలు, చోరీలు జరిగిన సమయంలో నిందుతులను సులువుగా పట్టుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల స్థలంలో ఇళ్ల నిర్మాణం