
మూగ వేదన!
సుస్తీ చేసిన పశువులకు చికిత్స కరువు
● మృత్యువాత పడుతున్న మూగజీవాలు
● అందుబాటులో ఉండని పశువైద్యులు
● వ్యాక్సిన్లు వేయకున్నా వేసినట్లు రికార్డులు
● ప్రభుత్వ ఆస్పత్రిలో జీతం.. ప్రైవేటులో విధులు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పశువులకు సుస్తీ చేస్తే సరైన చికిత్స అందక మూగ వేదన అనుభవిస్తున్నాయి. వివిధ రకాల వ్యాధులతో మృత్యువాతపడుతున్నాయి. వాటినే జీవనాధారంగా జీవనం సాగిస్తున్న రైతులకు తీరని శోకం మిగుల్చుతున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పశు వైద్య కేంద్రాల్లో పశువైద్యులు నిత్యం అందుబాటులో ఉండాలి. ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటించి, సీజన్ల వారీగా పశువులకు వచ్చే గాలికుంటు, ముద్ద చర్మ వ్యాధులు, పీపీఆర్(పారుడు), నట్టలతో వచ్చే జబ్బులపై అవగాహన కల్పించాలి. కొంత మంది వైద్యులు రోజుల తరబడి పశువైద్య కేంద్రాల ముఖం కూడా చూడడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అభాసుపాలు చేస్తున్నారు. వ్యాక్సిన్లు వేయకుండానే వేసినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి ఇటీవల చేపట్టిన వరుస తనిఖీల్లో విస్తుగొలిపే అంశాలు వెలుగుచూశాయి.
ఆస్పత్రుల ముఖం చూడని వైద్యులు
జిల్లాలో 10,31,460 పశువులు, 2,40,69,700 కోళ్లు, 1.67 లక్షల గేదెలు, 7,67,125 మేకలు, 2,56,632 గొర్రెలు, 6,076 పందులు, 1,535 గుర్రాలు, 16 గాడి దలు, 27,200 కుక్క లు, 2,947 కుందేళ్లు ఉన్నట్లు అంచనా. సీజన్ మారిన సమ యాల్లో పశువులు పలు వ్యాధుల బారినపడుతుంటాయి. వాటికి సత్వర చికిత్స కోసం ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా నాలుగు ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు, 46 ప్రాథమిక కేంద్రాలు, ఐదు మొబైల్ క్లినిక్స్, 87 సబ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఆరుగురు సహాయ సంచాలకులతో పాటు 48 మంది పశు వైద్య సహాయ శస్త్రచికిత్సకులు, 16 మంది వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్లు, 31 మంది జూనియర్ వెటర్నరీ ఆఫీసర్లు, 53 మంది లైవ్ స్టాక్ అసిస్టెంట్లు, 37 మంది వెటర్నరీ అసిస్టెంట్లు, 117 మంది ఆఫీసు సబార్డినేటర్లను నియమించింది. వీరంతా నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా పశువైద్య కేంద్రాల్లో అందుబాటులో ఉండాలి. మెజార్టీ పశువైద్యులు ఆస్పత్రులకు రావడం లేదు.
మచ్చుకు కొన్ని..
● కొందుర్గు ప్రాథమిక వెటర్నరీ క్లినిక్ వైద్యుడు ప్రభుత్వ పశువైద్యశాలలో కంటే.. తన ప్రైవేటు క్లినిక్‌లోనే ఎక్కువ ఉంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తరచూ విధులకు గైర్హాజరవుతుండడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారుల తనిఖీల్లో ఇదే అంశం స్పష్టమైంది.
● కనకమామిడి ప్రాథమిక వెటర్నరీ క్లినిక్ వైద్యుడిది సైతం ఇదే ధోరణి.
● ఆమనగల్లు వెటర్నరీ క్లినిక్‌లో పశువులకు చేసిన వైద్య పరీక్షలు, అందించిన చికిత్సల వివరాలు వైద్యుడు రాకపోవడంతో కిందిస్థాయి సిబ్బందే రికార్డు చేస్తుండటం విశేషం. బక్రీద్ విధుల్లో భాగంగా ఇక్కడి వైద్యుడికి శంకర్‌పల్లిలో డ్యూటీ వేయగా అంతదూరం వెళ్లనని చెప్పి, తర్వాత అదనపు డైరెక్టర్ ఆర్డర్‌ను సైతం ట్యాంపరింగ్ చేసి తనకు అనుకూలమైన ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది.
వ్యాక్సిన్ సీలు కూడా తీయకుండా..
గాలికుంటు వ్యాధి రహిత దేశంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గాలికుంటు వ్యాధి నిరోధక (ఎఫ్ అండ్ ఎండీ) టీకాల కార్యక్రమాన్ని ప్రతిష్టా త్మకంగా తీసుకుంది. ఇందుకు ఏటా రూ.40 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. హైదర్‌గూడ ప్రభుత్వ ప్రాథమిక పశువైద్య కేంద్రం(పీవీసీ)లోని వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేయకుండానే వేసినట్లు రికార్డు చేశారు. ఈ సెంటర్‌కు 110 ఎఫ్‌ఎండీసీ వ్యాక్సిన్ బాటిళ్లను సరఫరా చేయగా, ఒక్కో బాటిల్ 50 పశువుల చొప్పున 5,249 పశువులకు వ్యాక్సిన్ వేసినట్లు రాశారు. ఏ ఒక్క దానికీ వ్యాక్సిన్ వేయలేదు. సీల్ కూడా తీయని 25 బాటిళ్లను ఇటీవల తనిఖీ కోసం వచ్చిన జిల్లా అధికారి గుర్తించి స్వాధీనం చేసుకోవడం విశేషం. ఇక ఒక బాటిల్ 30 పశువులకు మాత్రమే వచ్చే బ్లాక్ వాటర్ వ్యాక్సిన్‌ను ఏకంగా 134 పశువులకు వేసినట్లు రికార్డుల్లో నమోదు చేశా రు. ఇచ్చిన మూడు బాటిళ్లలో సీల్‌కూడా తీయని రెండు బాటిళ్లు అక్కడే ఉన్నాయి. ఆయా బాటిళ్లను జిల్లా అధికారి ఇటీవల సీజ్ చేశారు. తనిఖీ సమ యంలో ఆస్పత్రికి తాళం వేసినట్లు గుర్తించి, సదరు వైద్యురాలిని హెచ్చరించారు. వరుస తనిఖీలతో హడలెత్తించిన సదరు జిల్లా వైద్యాధికారిపై కొంత మంది ఉద్దేశపూర్వకగా ఆశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి బదిలీ చేయించారు. ఈ అంశాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది.

మూగ వేదన!