
పోలీస్ పహారాలో ఎనికేపల్లి
మొయినాబాద్: గోశాల ఏర్పాటుకు కేటాయించిన ఎనికేపల్లి భూముల్లో పోలీస్ పహారా కొనసాగుతోంది. సర్వేనంబర్ 180లోని 99.14 ఎకరాల భూమిని ప్రభుత్వం గోశాల ఏర్పాటుకు కేటాయించిన విషయం తెలిసిందే. ఏడు దశాబ్దాలుగా భూములు సాగుచేసుకుంటున్న రైతులకు పరిహారం ఇస్తామని చెప్పిన అధికారులు పూర్తి స్థాయిలో పరిష్కరించలేదు. ఈ క్రమంలో గురువారం ఉదయం హెచ్‌ఎండీఏ అధికారులు భూములు సర్వే చేసేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న కొంతమంది రైతులు అక్కడికి చేరుకున్నారు. మహిళా రైతులు అక్కడే కూర్చొని రోదిస్తూ నిరసన వ్యక్తం చేశారు. భూముల్లోకి ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి పంపించారు. హెచ్‌ఎండీఏ అధికారులు సర్వే చేయకుండానే వెనుతిరిగారు. పోలీసుల పహారా సాయంత్రం వరకు కొనసాగింది.
ఎమ్మెల్యే యాదయ్యను కలిసిన రైతులు
భూములు కోల్పోతున్న రైతులు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఆయన నివాసంలో కలిశారు. తమకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం పెంచాలని.. ఎకరాకు సుమారు వెయ్యి గజాల స్థలాన్ని ఇవ్వాలని కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్ నారాయణరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం రైతులను తీసుకుని కలెక్టర్ వద్దకు వెళ్లారు. ఎకరాకు 800 గజాల స్థలాన్ని ఇవ్వాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంత ఇవ్వలేమని ప్రభుత్వ నిబంధనల ప్రకారం 200 గజాలు ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. కనీసం 400 గజాలైనా ఇవ్వాలని కోరగా అంత ఇవ్వలేమని కలెక్టర్ తేల్చి చెప్పారు. దీంతో మీపని మీరు చేసుకోండి.. వారిపని వారు చేసుకుంటారని చెప్పి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. పరిహారం విషయం ఎటూ తేలలేదు.
సర్వే చేసేందుకు వచ్చిన హెచ్‌ఎండీఏ అధికారులు
విషయం తెలిసి అక్కడికి చేరుకున్న రైతులు
అడ్డుకుని వెనక్కి పంపించిన పోలీసులు
ఎమ్మెల్యే, కలెక్టర్‌ను కలిసిన బాధితులు
ఎటూ తేలని పరిహారం విషయం

పోలీస్ పహారాలో ఎనికేపల్లి