
కొండంత బోనం.. కోటంత సంబురం
గోల్కొండ కోట ఆధ్యాత్మిక పరిమళాలతో అలరారింది. పోతురాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలతో పరవశించింది. ఆషాఢ మాసం బోనాల జాతరలో భాగంగా గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి గురువారం తొలి బోనం పూజ ఘనంగా జరిగింది. ఆషాఢ మాసంలో గురు, ఆదివారాల్లో జరిగే మొత్తం తొమ్మిది బోనాల ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. మొదటి వారం బోనాల జాతరకు వీఐపీలతో పాటు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. గోల్కొండ ఫతేదర్వాజా నుంచి ఘటాల ఊరేగింపు ముందుకు సాగింది. – సాక్షి, సిటీబ్యూరో