
ప్రభుత్వ విద్యను పరిరక్షించాలి
షాద్‌నగర్‌రూరల్: ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసేందుకు పన్నుతున్న కుట్రలను ఆపాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కువద్ద శుక్రవారం చేపట్టనున్న ధర్నా కరపత్రాన్ని గురువారం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ.. సర్కారు బడులను బలోపేతం చేసేందుకు అధిక నిధులు కేటాయించాలని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో 10 శాతం నిధులు కేటాయించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఆడిట్ కన్వీనర్ రవీంద్రనాథ్, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకుడు అర్జునప్ప తదితరులు పాల్గొన్నారు.