
‘స్థానిక’ సందడి!
● హైకోర్టు తీర్పుతో పల్లెల్లో మళ్లీ కదలిక ● పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు ● రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్థానిక సంస్థల ఎన్నికలకు లై న్ క్లియరైంది.మూడు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి కే గ్రామ పంచాయతీలు, వార్డులు, ఓటర్ల జాబితా ను సిద్ధంగా ఉంచిన అధికార యంత్రాంగం మరో సారి వాటిని సరి చూసుకునే పనిలో నిమగ్నమైంది. 2024 జనవరి 30తో స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఆయా గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. పాలక మండళ్లు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు అందక అధికారులు ట్రాక్టర్ డీజిల్ ఖర్చులు, వీధి లైట్లు, డ్రైనేజీల క్లీనింగ్, బోరుబావుల, మోటార్ల రిపేర్లకు అప్పులు చేయాల్సిన దుస్థితి. దీంతోపాటు ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన వారు సైతం ఓటర్లను ఆకర్షించేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. ఎన్నికల నిర్వహణ పై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఆయా గ్రామాల్లో మళ్లీ సందడి మొదలైంది. అయితే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై ఇప్పటికీ ఓ స్పష్టత రాకపోవడం ఆశావహులను ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది.
ఎంపీటీసీ, జెడ్పీటీసీలా? సర్పంచ్‌లా?
జిల్లాలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు.. ఔటర్ లోపల ఉన్న పాత మున్సిపాలిటీల్లో సమీప గ్రామా ల విలీనంతో జిల్లాలో ఎంపీటీసీ స్థానాలతో పాటు సర్పంచ్ స్థానాలు తగ్గాయి. గతంలో 13 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లు ఉండగా, కొత్తగా మెయినాబాద్, చేవెళ్ల మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ స్థానాల సంఖ్య 257 నుంచి 232 కి తగ్గింది. జిల్లా వ్యాప్తంగా గతంలో 558 గ్రామ పంచాయతీలుండగా, ప్రస్తుతం 32 గ్రామాలు ఆ యా మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో వీటి సంఖ్య 526కు చేరింది. ఇటీవల కొత్తగా మరికొన్ని గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. అయితే స్థానిక సంస్థల్లో బీసీ కోటా అమలు చేయాలని కోరుతూ కొంత మంది కోర్టును ఆశ్రయించడం, ఇదే అంశంపై ప్రభుత్వం కొంత వరకు కసరత్తు చేయడం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ ఎన్నికల్లోనూ పాత రిజర్వేషన్ పద్ధతినే కొనసాగిస్తారా? కొత్తగా ఏమైనా మార్పులు తీసుకొస్తారా? అనే అంశంపై స్పష్టత కొరవడింది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారా? లేక సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహిస్తారా? అనేది కూ డా తేలాల్సి ఉంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారులు అలెర్ట్ అయ్యారు. ఓటర్ల జాబితా, వార్డులు, పంచాయతీలు తదితర వివరాలను సరిచూసుకునే పనిలో పడ్డారు.
జీహెచ్‌ఎంసీ డివిజన్లు
మహేశ్వరం 02
ఎల్బీనగర్ 11
గచ్చిబౌలి 07
రాజేంద్రనగర్ 05