
విద్యావ్యవస్థలో మార్పే లక్ష్యం
● అభివృద్ధిలో ప్రజా భాగస్వామ్యమే ప్రధానం ● విద్యాశాఖ చైర్మన్ ఆకునూరి మురళి
మంచాల: అభివృద్ధిలో ప్రజా భాగస్వామ్యం ఉంటేనే ఏ కార్యక్రమైనా విజయవంతం అవుతుందని రాష్ట్ర విద్యాశాఖ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. మండల పరిధిలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్‌స్కూ ల్‌లో కొనసాగుతున్న పనులు, పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించేందుకు బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన వంగూరు, పోల్కంపల్లి గ్రామాలకు చెందిన పేరెంట్స్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు 150 మంది విచ్చేశారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా ఆరుట్ల ప్రభుత్వ పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మార్చామన్నారు. పేరెంట్స్ కమిటీ సహకారంతో 90 శాతం పనులు పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం పాఠశాలలో 2 వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారని చెప్పారు. పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు రాష్ట్రంలో ఆదర్శంగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంచాల ఎంఈఓ రాందాస్, ప్రధానోపాధ్యాయుడు గిరిధర్‌గౌడ్, సుప్రియ, ఉపాధ్యాయులు కిషన్ చౌహాన్, మోహన్, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు ఎం.డీ.జానీపాష, నూకం రాజు, భాస్కర్, జంగయ్య, శ్రీశైలం, స్వాతి, జ్యోతి, పారిజాత, సంధ్య, పార్వతి, మల్లేశ్ తదితరులుపాల్గొన్నారు.