
కారు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి
మొయినాబాద్: కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఇద్దరు మహిళలను బలిగొంది. మరో మహిళ మృత్యువుతో పోరాడుతోంది. స్థానికులు, ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఖైరతాబాద్‌కు చెందిన నందకిషోర్, అశ్విని(37) దంపతుల పిల్లలు మొయినాబాద్‌లోని సుజాత స్కూల్‌లో చదువుతున్నారు. దీంతో వీరి కుటుంబం కొంతకాలంగా హిమాయత్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు అశ్విని తన మరదలు లక్ష్మి స్కూటీపై రెడ్డిపల్లిలోని మీసేవ కేంద్రానికి బయలుదేరారు. చిలుకూరుకు వెళ్లగానే మేడిపల్లికి చెందిన కుమ్మరి సుశీల(60) యూకో బ్యాంకుకు వచ్చి తిరిగి వెళ్లేందుకు వీరిని లిఫ్ట్ అడిగింది. ముగ్గురూ స్కూటీపై వెళ్తుండగా రెడ్డిపల్లి సమీపంలో ఎదురుగా వచ్చిన కారు అతివేగంతో ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలపాలైన వీరిని చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అశ్విని, సుశీల మృతిచెందారు. లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
అర కిలోమీటర్ దూరంలోనే...
స్కూటీపై వెళ్తున్న మహిళలు మరో రెండు నిమిషాల్లో గమ్య స్థానానికి చేరుకునేవారు. అరకిలోమీటర్ దూరంలో దూరంలో ప్రమాదానికి గురికావడంతో ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిశాయి. కారు అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన చోట ఓ షాపులో ఉన్న సీసీ కెమరాల్లో ప్రమాదం జరిగిన తీరు నిక్షిప్తమైంది. కారు అతివేగంతో వచ్చి స్కూటీని ఢీకొట్టినట్లు సీసీ టీవీలో రికార్డయ్యింది.
ప్రాణాపాయ స్థితిలో మరో మహిళ
స్కూటీని కారు ఢీకొట్టడంతో ప్రమాదం
మొయినాబాద్ మండలం
రెడ్డిపల్లి సమీపంలో ఘటన

కారు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి