
అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ అరెస్టు
షాద్‌నగర్‌రూరల్: మహిళల మెడలో బంగారు పుస్తెల తాళ్లనే లక్ష్యంగా చేసుకొని చోరీలకు తెగబడుతున్న ఓ దుండగుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల పాలు చేశారు. బుధవారం పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో సీఐ విజయ్‌కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని నాగులపల్లి గ్రామానికి చెందిన నల్లపురం బల్వంత్‌రెడ్డి, అనసూయ దంపతులు ఈ నెల 11న ద్విచక్ర వాహనంపై రామేశ్వరం దైవ దర్శనానికి వెళుతున్నారు. హజిపల్లి శివారు దాటుతుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వెనక నుంచి వచ్చి అనసూయ మెడలో ఉన్న నాలుగున్నర తులాల బంగారు పుస్తెల తాడును తెంచుకొని పారిపోయారు. ఈ ఘటనపై దంపతులు అదే రోజు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారీగా సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. పోలీసులు లక్నోలో ప్రధాన నిందితుడు మహేంద్రరాస్తోగిని అరెస్టు చేయగా, మరో నిందితుడు చాంద్‌బాబు పరారీలో ఉన్నాడు. తమదైన శైలిలో విచారించగా ప్రధాన నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి నుంచి ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్ స్వాఽధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. అతడిపై కర్నూల్, విజయనగరం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, అల్వాల్, బాచుపల్లితో పాటుగా ఉత్తర్‌ప్రదేశ్‌లో బైక్, చైన్‌స్నాచింగ్, మర్డర్, గంజాయికి సంబంధించి 20పైగా కేసులు ఉన్నాయి. చాకచాక్యంగా కేసును ఛేదించిన క్రైమ్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.
బంగారం చోరీ చేసి యూపీకి పరారీ