
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కేశంపేట: పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగిరాకపోవడం, చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని లేమామిడి శివారు తుర్కలపల్లికి చెందిన దిద్దెల ప్రశాంత్ (30) కూలీ పనులు చేస్తూ భార్య కృష్ణవేణి, ఇద్దరు పిల్లలతో కలిసి జీవించేవాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలు నెలకొడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కృష్ణవేణి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈనెల 23న ఆమెను తీసుకువచ్చేందుకు వెళ్లగా తిరస్కరించడంతో మరుసటి రోజు తిరిగి వచ్చేశాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి తన ఇంట్లోని రేకుల పైపునకు ఉరేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని, తలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల కారణంగానే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రశాంత్ తండ్రి దిద్దెల పెద్దయ్య పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరహరి తెలిపారు.