
విపక్షాలది దుష్ప్రచారం
● నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి
ఆమనగల్లు: రాష్ట్రంలో ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వంపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని నాగర్‌కర్నూల్ ఎంపీ డా.మల్లురవి అన్నారు. పట్టణంలో సోమవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు ఒక్క ఇల్లూ ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని తెలిపారు. తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్లు రైతుభరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఎంపీ మల్లురవి మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పీసీబీ మాజీ సభ్యుడు బాలాజీసింగ్, పీసీసీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, మార్కెట్ మాజీ వైస్‌చైర్మన్ గుర్రం కేశవులు, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మండ్లి రాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మాణయ్య, చేనేత సంఘం మాజీ అధ్యక్షుడు కోట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.