
ఓఆర్‌ఆర్ పరిధిలోనూ భరోసా ఇవ్వాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని ఉన్న మండలాలకు రైతు భరోసా విడుదల చేయాలని ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ కృపేశ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు బీఆర్‌ఎస్ ఎల్మినేడు గ్రామ అధ్యక్షుడు దొమకొండ నర్సింహ అధ్యక్షతన మహాధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కృపేష్, బుగ్గరాములు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెండు దఫాలుగా రైతు భరోసా ఇవ్వకపోవడం సిగ్గు చేటు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం మండలాల రైతులు ఓట్లు వేయలేదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో వివక్ష చూపకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తోందన్నారు. రైతులపై వివక్ష చూపడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా విడుదల చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి, బుట్టి మహేశ్, నిట్టు జగదీశ్వర్, బాష, యాదయ్య, రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, రాంరెడ్డి, పలువరు రైతులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ కృపేశ్
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఎల్మినేడులో ధర్నా