
మహిళ మెడలోంచిపుస్తెలతాడు చోరీ
యాచారం: బస్సు కోసం వేచి చూస్తున్న మహిళ మెడలోంచి గుర్తు తెలియని వ్యక్తులు బంగారు పుస్తెల తాడును అపహరించారు. యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన బండ పార్వతమ్మ(58) సోమవారం మధ్యాహ్నం స్వగ్రామా నికి వెళ్లేందుకు నక్కర్తమేడిపల్లిలోని బంధువు ల ఇంటి నుంచి తక్కళ్లపల్లి గేట్ వద్దకు వచ్చింది. ఇది గమనించిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు హెల్మెట్ ధరించి, బైక్‌పై వచ్చారు. బస్సు కోసం వేచి చూస్తున్న పార్వతమ్మ మెడలోని మూడు తులాల పుస్తెల తాడును లాక్కెళ్లారు. ఈ సమయంలో పార్వతమ్మ కిందపడిపోయినా దుండగులు మాత్రం తాడు వదల్లేదు. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారి వెంట ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
మేస్త్రీ అదృశ్యం
మొయినాబాద్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన మేస్త్రీ అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పో లీసులు తెలిపిన ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా దౌల్తాబాద్‌కు చెందిన దాగునపురం రాములు(40) భార్య లక్ష్మితో కలిసి మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరులో నివాసం ఉంటూ మేస్త్రీ పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పరిసర ప్రాంతాలు, బంధువు లు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సోమవారం మొయినాబాద్ ఠా ణాలో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
సీసీ కెమెరాలు, ఎన్వీఆర్ డివైస్ తస్కరణ
కడ్తాల్: మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రంలో సీసీ కెమెరాలతో పాటు, ఎన్వీఆర్ డివైస్ చోరీకి గురైంది. ఈ ఘటన సోమ వారం వెలుగులోకి వచ్చింది. సీఐ గంగాధర్ తెలిపిన ప్రకారం.. పాలశీతలీకరణ కేంద్రంలోని ల్యాబ్‌లో నిఘా కోసం ఏర్పాటు చేసిన రెండు సీసీ కెమెరాలు, ఎన్వీఆర్ డివైస్‌ను ఏర్పాటు చేశారు. ఈ నెల 21న గుర్తు తెలియని దుండగులు వీటిని ఎత్తుకెళ్లారు. సోమవారం గమనించిన పాలశీతలీకరణ కేంద్రం ఇన్‌చార్జి మేనేజర్ ఉదయశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.